Actress | విదేశాల్లో సినిమా షూటింగ్‌లకు వెళ్లిన పలువురు సినీ ప్రముఖులు అనుకోని ఇబ్బందులను ఎదుర్కొన్న సందర్భాలు గతంలో చాలానే ఉన్నాయి. తాజాగా ఓ కొత్త హీరోయిన్‌కు పారిస్‌లో చేదు అనుభవం ఎదురైంది. తెలుగులో ‘హ్యాపీ జర్నీ’ సినిమాతో ఎంట్రీ ఇవ్వబోతున్న నటి జినీషా, పారిస్‌కు చేరుకున్న వెంటనే దాదాపు రూ.4 లక్షల విలువైన సూట్‌కేసులను పోగొట్టుకోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ‘హ్యాపీ జర్నీ’ చిత్రంలో అన్నపూర్ణమ్మ, ఝాన్సీ, ఆమని, పాయల్ రాధాకృష్ణ, రవి శివతేజ, వంశీ, జినీషా, రూప తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. పలువురు విభిన్న వ్యక్తులు కలిసి ప్యారిస్‌కు వెళ్లిన తర్వాత జరిగే ఆసక్తికర సంఘటనల నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది.
ఈ సినిమా షూటింగ్ మొత్తం ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లోనే నిర్వహించారు. దాదాపు 22 రోజుల పాటు చిత్రబృందం అక్కడే ఉండి షూటింగ్ పూర్తి చేసింది. ఇటీవల ఈ చిత్ర టీజర్ లాంచ్ కార్యక్రమం ఘనంగా నిర్వహించగా, ఆ కార్యక్రమంలో నటి ఝాన్సీ చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాయి. “పారిస్‌లో దిగిన వెంటనే మా అమ్మాయి జినీషా సూట్‌కేసులు పోయాయి. దాదాపు నాలుగు లక్షల రూపాయల విలువైన దుస్తులు, వ్యక్తిగత వస్తువులు ఉన్న బ్యాగులు కనిపించలేదు” అని ఝాన్సీ వెల్లడించారు. ఈ విషయంపై జినీషాను ప్రశ్నించగా, ఆ సంఘటనను గుర్తు చేసుకుంటూ ఆమె భావోద్వేగానికి గురయ్యారు. నేను చాలా జాగ్రత్తగా అన్ని వస్తువులు సర్దుకుని వచ్చాను. ఇప్పుడు ఆ విషయాన్ని గుర్తు చేసుకుని ఏడిస్తే బాగోదు అంటూ ఆమె స్పందించారు.
విదేశీ ప్రయాణం ప్రారంభమైన మొదటి రోజే ఇలాంటి అనుకోని ఘటన జరగడంతో జినీషా తీవ్ర ఆందోళనకు గురైనట్లు సమాచారం. అయితే ఆ సమయంలో చిత్ర నిర్మాణ సంస్థ, యూనిట్ సభ్యులు ఆమెకు పూర్తిగా అండగా నిలిచారని తెలుస్తోంది. అవసరమైన దుస్తులు, ఇతర వస్తువులను ఏర్పాటు చేసి ఆమెకు ధైర్యం చెప్పినట్లు చిత్ర వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక ‘హ్యాపీ జర్నీ’ చిత్రంపై ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొంది. ప్యారిస్ అందాల మధ్య తెరకెక్కిన ఈ చిత్రం వినోదం, భావోద్వేగాలు, కుటుంబ అనుబంధాలతో సాగనున్నట్లు సమాచారం. ప్రస్తుతం జినీషా సూట్‌కేసులు మిస్సైన ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా, పలువురు నెటిజన్లు ఆమెకు ధైర్యం చెబుతూ కామెంట్లు చేస్తున్నారు. విదేశాల్లో షూటింగ్‌ల సమయంలో ఎదురయ్యే అనుకోని సమస్యలకు ఇది మరో ఉదాహరణగా సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.