సినీరంగంలో ప్రతి శుక్రవారం జాతకాలు మారిపోతుంటాయి. ఎప్పుడు ఎవరిని అదృష్టం వరిస్తుందో చెప్పలేం. ‘మిమి’ చిత్రం తన కెరీర్‌కు బంగారు బాటలు వేసిందని సంతోషం వ్యక్తం చేసింది బాలీవుడ్ కథానాయిక కృతిసనన్. కెరీర్ ఆరంభంలో పలు కమర్షియల్ చిత్రాల్లో నటించిన ఈ భామకు ఆశించిన స్థాయిలో గుర్తింపు దక్కలేదు. అద్దె గర్భం కాన్సెప్ట్‌తో రూపొందించిన ‘మిమి’ చిత్రంలో అద్భుతాభినయంతో కృతిసనన్ విమర్శకుల ప్రశంసలందుకుంది. ప్రస్తుతం ఆమె ‘ఆదిపురుష్’ ‘గణపత్’ వంటి భారీ చిత్రాల్లో నటిస్తున్నది. కృతిసనన్ మాట్లాడుతూ “మిమి’ చిత్రం నాలో దాగివున్న ప్రతిభాపాటావాల్ని పూర్తి స్థాయిలో వెలికితీసింది.
అదొక భావోద్వేగభరితమైన ప్రయాణం. నా పాత్రతో సహానుభూతిచెందాను కాబట్టే తెరపై హృదయాల్ని కదిలించే ఉద్వేగాలు పండాయి. ఆ సినిమా తర్వాత దర్శకనిర్మాతలు నాలోని ప్రతిభను గౌరవిస్తున్నారు. ఇప్పుడు నేను కలలో కూడా ఊహించని అవకాశాలొస్తున్నాయి. ‘ఆదిపురుష్’ పౌరాణిక కథాంశంతో తెరకెక్కుతున్నది. ‘గణపత్’ పూర్తి స్థాయిలో యాక్షన్ ఎంటర్టైనర్. ఇలా పూర్తి భిన్నమైన కథాంశాల్లో భాగం కావడం అదృష్టంగా భావిస్తున్నా. ‘ఆదిపురుష్’లో సాత్వికాభినయంతో మెప్పిస్తాను. ‘గణపత్’లో శక్తివంతమైన యాక్షన్ రోల్లో కనిపిస్తా’ అని చెప్పుకొచ్చింది.