అగ్ర కథానాయిక కీర్తి సురేష్ ఆడిపాడిన వీడియో ఆల్బమ్ ‘గాంధారి’. ‘సారంగదరియా..’ పాటతో శ్రోతలను ఆకట్టుకున్న సంగీత దర్శకుడు పవన్ సీహెచ్ ఈ పాటను స్వరపరిచారు. సుద్దాల అశోక్‌తేజ సాహిత్యాన్ని అందించారు. ప్రముఖ సంస్థలు సోనీ మ్యూజిక్ సౌత్, ది రూట్ నిర్మించాయి. ‘గాంధారి’ వీడియో ఆల్బమ్ విడుదల కార్యక్రమం తాజాగా హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో సోనీ మ్యూజిక్, ద రూట్ సంస్థల ప్రతినిధులతో పాటు సంగీత దర్శకుడు పవన్ సీహెచ్, కొరియోగ్రాఫర్ బృందా మాస్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కీర్తి సురేష్ మాట్లాడుతూ…‘వీడియో ఆల్బమ్ చేయడం నాకొక కొత్త అనుభవం. సారంగదరియా పాట తర్వాత పవన్ ‘గాంధారి’ పాటను గొప్పగా స్వరపరిచారు. సుద్దాల అశోక్‌తేజ గారి సాహిత్యం ఆకట్టుకుంటుంది. బాలనటిగా నాకు డ్యాన్సులు నేర్పించిన మొదటి కొరియోగ్రాఫర్ బృందామాస్టర్. ఇవాళ మళ్లీ ఆమెతో ఆల్బమ్ చేయడం సంతోషంగా ఉంది. సోనీ మ్యూజిక్, ద రూట్ సంస్థలకు కృతజ్ఞతలు’ అన్నారు.