హైదరాబాద్, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ) : ఎలాంటి డ్రగ్ టెస్టుకైనా తాను సిద్ధంగా ఉన్నట్లు సినీ నటి హేమ తెలిపారు. తనపై నిషేధం ఎత్తివేయాలని, తనని నిర్దోషిగా గుర్తించాలని కోరుతూ మంగళవారం హేమ ఓ వీడియో విడుదల చేశారు. ఆ వీడియోలో హేమ మాట్లాడుతూ.. ‘35 ఏండ్లుగా నేను సంపాదించుకున్న పరువును భూస్థాపితం చేశారు. నేను కొన్ని టెస్టులు చేయించుకున్నా. అన్నింటిలోనూ నెగిటివ్ వచ్చింది. అనుమానం ఉన్నవారికి చూపించాను. ఈ వీడియో చేయడానికి ప్రధాన కారణం ఒక్కటే.. నేను ఎలాంటి టెస్టులకైనా బహిరంగంగా రెడీ.
అది మీ ముందు చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను. అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ అపాయింట్మెంట్ కోసం ఈ వీడియో చేస్తున్నాను. ఇన్నాళ్లూ నన్నొక తీవ్రవాదిలా చూశారు. నన్ను ఎంతో మంది మీడియా వాళ్లు బ్లాక్ మెయిల్ చేశారు. సెటిల్మెంట్కు రమ్మని ఫోర్స్ చేశారు. నాకు మీడియాకు గొడవలు లేవు. నేనెందుకు రావాలి. నేను ఏ తప్పూ చేయలేదు. నన్ను ఎవరెవరు బ్లాక్ మెయిల్ చేస్తున్నారో వారందరి నంబర్లు ఉన్నాయి. ఆ నంబర్లన్నీ తొందర్లోనే అప్డేట్ చేస్తాను’ అంటూ ముగించారు.