Actress Hansika Motwani | టాలీవుడ్ నటి హన్సికా మోత్వానీ (Hansika Motwani) బాంబే హైకోర్ట్‌ను ఆశ్రయించింది. తనపై నమోదైన గృహ హింస (domestic violence) కేసును కొట్టివేయాలని కోరుతూ బాంబే హైకోర్టులో(Bombay High Court) క్వాష్ పిటిషన్ దాఖాలు చేసింది. గతేడాది ప్రశాంత్ మోత్వానీ (హన్సికా మోత్వానీ సోదరుడు) భార్య ముస్కాన్ నాన్సీ హన్సిక కుటుంబంపై గృహ హింస కేసును నమోదు చేసిన విషయం తెలిసిందే. 2024న డిసెంబర్ 18న ముంబైలోని అంబోలి పోలీస్ స్టేషన్లో ఈ ఫిర్యాదు నమోదైంది.
ఇందులో హన్సికా, ఆమె తల్లి మోనా మోత్వానీ తన భర్తతో వివాహం, రిలేషన్షిప్ విషయంలో జోక్యం చేసుకొని మనస్పర్థలు వచ్చేలా చేశారని ముస్కాన్ ఆరోపించింది. తన భర్త గృహ హింసకు కూడా పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో తాను బెల్ ఫాల్సీ అనే నాడీ సంబంధిత రుగ్మత (పక్షవాతం) బారిన పడ్డానని చెప్పింది ముస్కాన్ . హన్సిక, అత్త ఆస్తి లావాదేవీలకు సంబంధించి మోసపూరిత కార్యకలాపాలకు పాల్పడుతున్నారని తెలిపింది.
అయితే ఈ కేసు విషయంలో హన్సికా, ఆమె తల్లి జ్యోతి మోత్వానీ తమపై నమోదైన సెక్షన్ 498A కేసును రద్దు చేయాలని బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్ సరంగ్ కోట్వాల్, జస్టిస్ SM మోడక్‌లతో కూడిన ధర్మాసనం ముస్కాన్ నాన్సీకి నోటిసులు జారీ చేసి తదుపరి విచారణను జూలై 3కి వాయిదా వేసింది.
ముస్కాన్ నాన్సీ జేమ్స్ టీవీ నటిగా గుర్తింపు తెచ్చుకుంది. “మాతా కీ చౌకీ” సీరియల్లో నటించి స్టార్ అయిన ఈ భామ 2021లో ప్రశాంత్ మోత్వానీని వివాహం చేసుకుంది. అయితే ఈ జంట 2022లోనే విడిపోవాలని నిర్ణయించుకుంది. కానీ సడన్‌గా నాన్సీ 2024 డిసెంబర్లో మోత్వానీ కుటుంబంపై గృహ హింస కేసు పెట్టడంతో ఈ విషయం సంచలనంగా మారింది. గృహ హింస కేసులో హన్సికా, ఆమె తల్లి జ్యోతి మోత్వానీ కేసు నమోదు అవ్వగా.. గత ఫిబ్రవరి ముంబై సెషన్స్ కోర్టు నుండి ముందస్తు బెయిల్ పొందారు.