Actress | సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సెలబ్రిటీలపై నిబంధనలు మరింత కఠినంగా అమలవుతున్నాయన్న విషయాన్ని తాజాగా తమిళ బుల్లితెర నటి, బిగ్‌బాస్ విజేత అర్చనా రవిచంద్రన్ ఉదంతం మరోసారి గుర్తు చేసింది. తిరువణ్ణామలైలోని అరుణాచల గిరిపై అనుమతి లేకుండా వెళ్లిన ఘటనలో ఆమె వివాదంలో చిక్కుకున్నారు. అరుణాచలేశ్వరస్వామి ఆలయానికి వెనుకభాగంలో ఉన్న అన్నామలై కొండ ప్రాంతం పౌర్ణమి రోజుల్లో లక్షలాది మంది భక్తులతో కిటకిటలాడుతుంది. అయితే, పర్యావరణ పరిరక్షణ, అడవి జీవుల భద్రత దృష్ట్యా ఆ కొండపైకి ఎక్కడాన్ని అటవీశాఖ పూర్తిగా నిషేధించింది. నిషేధం అమల్లో ఉన్నప్పటికీ, అర్చనా రవిచంద్రన్ తనకు కాబోయే భర్త అరుణ్ ప్రసాద్‌తో పాటు కొందరు స్నేహితులతో కలిసి కొండపైకి వెళ్లినట్టు తెలిసింది.
కొండపై తీసిన ఫోటోలు, వీడియోలను అర్చనా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆ పోస్టులు వైరల్ కావడంతో, నిషేధిత అటవీ ప్రాంతంలో అక్రమ ప్రవేశం జరిగిందంటూ అటవీశాఖ అధికారులు రంగంలోకి దిగారు. దర్యాప్తు అనంతరం అర్చనా రవిచంద్రన్‌తో పాటు అరుణ్ ప్రసాద్‌ను అదుపులోకి తీసుకుని, ఇద్దరికీ రూ.5 వేల చొప్పున జరిమానా విధించారు. అనంతరం ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా హెచ్చరించి విడుదల చేశారు. అధికారుల ప్రకారం, అనుమతి లేకుండా గిరిపైకి వెళ్లడమే కాకుండా, ఇతరులను కూడా అలా చేయాలని ప్రోత్సహించినట్టు ఆరోపణలు ఉన్నాయి. నిషేధిత అటవీ ప్రాంతంలో ట్రెక్కింగ్ చేయడం చట్ట విరుద్ధమని, ఇది సత్యమంగళం టైగర్ రిజర్వ్ పరిధిలోకి వచ్చే భవానీసాగర్ అటవీ ప్రాంతమని అటవీశాఖ స్పష్టం చేసింది. భవిష్యత్తులో ఎవరైనా ఇలాంటి నిబంధనల్ని ఉల్లంఘిస్తే జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా తప్పదని అధికారులు హెచ్చరించారు.
ఈ ఘటనకు కొద్ది రోజుల ముందే అర్చనా రవిచంద్రన్, నటుడు అరుణ్ ప్రసాద్‌ల నిశ్చితార్థం ఘనంగా జరిగింది. దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అయ్యాయి. తమిళ బిగ్‌బాస్ సీజన్ 7లో వైల్డ్ కార్డు ఎంట్రీతో షోలో అడుగుపెట్టిన అర్చనా, చివరకు టైటిల్ గెలిచి చరిత్ర సృష్టించింది. వైల్డ్ కార్డు ద్వారా వచ్చి విజేతగా నిలిచిన తొలి కంటెస్టెంట్‌గా ఆమెకు ప్రత్యేక గుర్తింపు లభించింది. ఇప్పుడు ఈ తాజా వివాదంతో అర్చనా పేరు మరోసారి వార్తల్లో నిలిచింది.