తమిళ నటుడు విక్రమ్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఛాతీలో అసౌకర్యంగా ఉండటంతో ఆయన్ని చెన్నైలోని కావేరీ ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, చికిత్స అందిస్తున్నామని..త్వరలో డిశ్చార్జి చేస్తామని వైద్యులు ఓ ప్రకటనలో తెలిపారు. విక్రమ్ అనారోగ్యానికి గురయ్యారని తెలియగానే ఆయనకు గుండెపోటు అంటూ వార్తలు వ్యాప్తి చెందాయి. దీనిపై విక్రమ్ కుమారుడు ధృవ్ స్పందిస్తూ…‘నాన్న ఆరోగ్యంగా ఉన్నారు. ఆయనకు గుండెపోటు అంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదు. దయచేసి ఇటువంటి అసత్య ప్రచారాలు చేయకండి. ఛాతీలో అసౌకర్యంగా అనిపించడంతో ఆయన ఆస్పత్రిలో చేరారు. త్వరలోనే డిశ్చార్జి అవుతారు’ అని పేర్కొన్నారు. విక్రమ్ నటించిన ‘కోబ్రా’, ‘పొన్నియన్ సెల్వన్’ అనే రెండు సినిమాలు త్వరలో విడుదలకు సిద్ధమవుతున్నాయి.