Actor Venkat In Pawan Kalyan OG | ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజకీయాలకు విరామం ఇచ్చి కొన్ని రోజులుగా సినిమా షూటింగ్‌లు పూర్తి చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే హరిహరవీరమల్లుని ప్రేక్షకుల ముందుకు తీసుకురాగా.. ఈ చిత్రం మిక్స్డ్ టాక్‌తో నడుస్తుంది. మరోవైపు దర్శకుడు సుజిత్‌తో ఓజీ అనే సినిమాను కూడా కంప్లీట్ చేశాడు. ఈ చిత్రం ఈ ఏడాది సెప్టెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికర విషయాన్ని పంచుకున్నాడు నటుడు వెంకట్.
నటుడు వెంకట్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సీతారాముల కళ్యాణం చూద్దాం రారండి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అనంతరం అన్నయ్య , ఆనందం, శివరామరాజు లాంటి సినిమాల్లో పాపులర్ నటుడిగా మారాడు. అయితే ఆ తర్వాత కెరీర్లో హీరోగా నిలదోక్కుకోలేక పోయాడు వెంకట్. రీసెంట్గా ఇచ్చట వాహనాములు నిలపరాదు అనే సినిమాలో నటించాడు. అయితే ఈ నటుడు పవన్ నటిస్తున్న ఓజీలో కీలక పాత్రలో నటిస్తున్నట్లు తెలిపాడు. ఈ మూవీలో ఒక సన్నివేశంలో పవన్ కళ్యాణ్ కాలర్ పట్టుకునే సీన్ ఉందని.. అది దర్శకుడు చెప్పగానే నేను భయంతో వణికిపోయినట్లు వెంకట్ చెప్పుకోచ్చాడు.
పవన్ కళ్యాణ్ పెద్ద స్టార్. ఇప్పుడు డిప్యూటీ సీఎం. ఆయనను తాకడమే పెద్ద విషయం. నువ్వు డైరెక్ట్‌గా కాలర్ పట్టుకోమంటున్నావు. ఆయన ఫ్యాన్స్ నన్ను ఊరుకుంటారా, నా వల్ల కాదు అని దర్శకుడికి చెప్పేశాను. అయితే సుజిత్ మాత్రం మీరు ఏం చేస్తారో తెలియదు కానీ మీరే అన్నయ్యని ఒప్పించి కాలర్ పట్టుకోవాలి అని నన్ను ఇరికించాడు. దీంతో నేను భయంగానే ఆయన దగ్గరికి వెళ్లి అన్నయ్య నేను మీ కాలర్ పట్టుకోవాలి ఒక సీన్లో అని చెప్పాను. దీనికి పవన్. ఒకే దాంట్లో ఏముంది అంటూ సీన్‌ని ఒకే చేశాడంటూ వెంకట్ చెప్పుకోచ్చాడు.