తమిళ అగ్ర నటుడు శివకార్తికేయన్ నటిస్తున్న యాక్షన్ ఎంటైర్టెనర్ ‘మదరాసి’. ఎ.ఆర్.మురుగదాస్ దర్శకుడు. శ్రీలక్ష్మీ మూవీస్ సంస్థ ప్రతిష్టాత్మకంగా ఈ పాన్ ఇండియా సినిమాను నిర్మిస్తున్నది. సెప్టెంబర్ 5న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా థియేట్రికల్ ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు. ‘నీలాగే ఇతరులను ప్రేమించు.. అందరూ నీ కుటుంబమే అనుకో.. అదే అందరు దేవుళ్లూ చెప్పేది..’ అనే హీరోయిన్ డైలాగ్తో ట్రైలర్ మొదలైంది. అక్కడ్నుంచి వేగంగా మలుపు తిరిగిన కథను ట్రైలర్లో చూడొచ్చు.
సిటీ వైపు ఆరు ట్రక్కుల్లో అక్రమంగా తయారు చేసిన గన్స్ బయలుదేరడం.. వాటిని అడ్డుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగడం.. వీటన్నింటికీ కేంద్ర బిందువులా, అరుదైన మానసిక స్థితి కలిగిన వ్యక్తిగా శివకార్తికేయన్ పాత్ర పరిచయం కావడం, తన స్థితి ప్రమాదకరమైన పరిస్థితులకు దారితీయడం.. ఇలా క్యూరియాసిటీని పెంచే అంశాలతో ట్రైలర్ సాగింది. భావోద్వేగాలతో కూడిన యూనిక్ కథాంశంతో మురుగదాస్ ఈ సినిమాను మలిచారని మేకర్స్ చెబుతున్నారు. రుక్మిణి వసంత్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో విద్యుత్ జమ్వాల్, బిజు మీనన్, షబీర్ కల్లరక్కల్, విక్రాంత్ తదితరులు ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: సుదీప్ ఎలామన్, సంగీతం: అనిరుధ్ రవిచందర్.