Malayalam Actor Siddique | మలయాళ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (Association of Malayalam Movie Artists (AMMA)కు జనరల్ సెక్రటరీగా కొనసాగుతున్న సీనియర్ నటుడు సిద్ధిఖీ తన పదవికి రాజీనామా చేశాడు. తనను రేప్ చేశాడంటూ నటి రేవతి సంపత్ సిద్ధిఖీపై ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణలు మాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. దీంతో మలయాళ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పదవికి రాజీనామా చేసి ఆదివారం తన రాజీనామా లేఖను ప్రెసిడెంట్ మోహన్ లాల్‌కు అందజేశాడు. తనపై వచ్చిన ఆరోపణల కారణంగానే తాను ఈ పదవి నుంచి వైదొలుగుతున్నానని, ఈ పరిస్థితిలో పదవిలో కొనసాగడం సరికాదని ఆయన ధృవీకరించారు. తనపై వచ్చిన ఆరోపణలపై న్యాయ సలహా తీసుకున్న తర్వాత స్పందిస్తానని సిద్ధిక్ తెలిపారు.
సిద్ధిఖీ తనను ట్రాప్ చేసి రేప్ చేశాడంటూ రేవతి సంపత్ ఆరోపించింది. తనతో పాటు తన స్నేహితులను కూడా లైంగికంగా సిద్ధిఖీ వేధించాడంటూ రేవతి సంపత్ చేసిన వ్యాఖ్యలు మలయాళ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. అయితే ఈ మలయాళ ఇండస్ట్రీలో మహిళలపై జరుగుతోన్న వేధింపులపై కేరళ ప్రభుత్వం జస్టిస్ హేమ కమిటీ (Hema Committee Report)ని ఏర్పాటు చేయగా.. ఈ కమిటీ సిద్ధం చేసిన రిపోర్ట్ ఆ పరిశ్రమను కుదిపేస్తోంది.
అయితే ఈ రిపోర్ట్‌కు సంబంధించి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ గత శుక్రవారం ఓ సమావేశాన్ని ఏర్పాటుచేసింది. ఇందులో ఇండస్ట్రీలో లైంగిక వేధింపులను సహించేది లేదని, బాధితులకు అసోసియేషన్ అండగా ఉంటుందని జనరల్ సెక్రటరీ సిద్ధిఖీ పేర్కొన్నాడు. అయితే అతడు ప్రకటించిన తర్వాతి రోజే అతడిపైన కూడా ఆరోపణలు రావడం గమనార్హం.