‘కన్నప్ప’లో కచ్చితంగా నా పాత్ర ఉండాలని పట్టుబట్టి మరీ మోహన్‌బాబు నాతో నటింపజేశారు. ఇందులో మోహన్‌బాబుగారు పోషించిన మహదేవశాస్త్రి కొడుకు పాత్రలో నేను కనిపిస్తా. నిజానికి ఈ సినిమాలో నా పాత్ర నిడివి, ప్రాముఖ్యత కూడా కాస్త తక్కువే. అయితే.. ఇలాంటి గొప్ప కథతో రూపొందిన పాన్ ఇండియా సినిమాలో భాగం అవ్వడమే అదృష్టం. అందుకే ఇంకేమీ ఆలోచించకుండా ‘కన్నప్ప’లో నటించా.’ అని నటుడు శివబాలాజీ అన్నారు. మంచు విష్ణు కథానాయకుడిగా రూపొందిన భక్తిరసాత్మక చిత్రం ‘కన్నప్ప’. ముఖేష్‌కుమార్ సింగ్ దర్శకుడు. డా.మోహన్‌బాబు నిర్మాత. ఈ నెల 27న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో నటుడు శివబాలాజీ విలేకరులతో ముచ్చటించారు.
‘ఈ సినిమాకోసం రెండు నెలలు న్యూజిలాండ్‌లో ఉన్నాను. మోహన్‌బాబుగారు షూటింగ్ చేసినన్ని రోజులూ ఆ షూట్లో నేనూ ఉన్నాను. ఆయన ఆన్‌స్క్రీన్ ఒకలా ఉంటారు. ఆఫ్‌స్క్రీన్‌లో ఒకలా ఉంటారు. మోహన్‌బాబుగారితో దగ్గరవ్వడం కష్టం. దగ్గరైతే ప్రేమతో కట్టిపడేస్తారాయన’ అని తెలిపారు. “కన్నప్ప’గా మంచు విష్ణు అద్భుతంగా నటించారు. ముఖ్యంగా సెకండాఫ్‌లో ఆయన నటన సూపర్. ఇక ప్రభాస్, అక్షయ్‌కుమార్, మోహన్‌లాల్ పాత్రల ఎంట్రీలే అదిరిపోతాయి. ప్రస్తుతం మోహన్‌బాబుగారి ప్రొడక్షన్లో హీరోగా ఓ సినిమా చేస్తున్నాను. ‘రెక్కీ 2’ కూడా త్వరలోనే రానుంది’ అని తెలియజేశారు శివబాలాజీ.