Shahid Kapoor | పటౌడి వంశ వారసుడు, బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై దాడి జరిగిన విషయం తెలిసిందే. గురువారం తెల్లవారుజామున ముంబై బాంద్రాలోని ఆయన నివాసంలోకి చొరబడిన దుండగుడు కత్తితో సైఫ్‌పై దాడి చేశాడు. దీంతో ఆయన ఒంటిపై ఆరుచోట్ల గాయాలయ్యాయి. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను హుటాహుటిన లీలావతి దవాఖానకు తరలించారు. గాయలతో ఉన్న సైఫ్‌కి వైద్యులు సర్జరీ చేయగా.. ప్రస్తుతం ఇంటెన్సివ్ కేర్‌లో చికిత్స తీసుకుంటున్నాడు. ఇదిలావుంటే సైఫ్ ఘటనపై బాలీవుడ్ సినీ ప్రముఖులతో పాటు రాజకీయ నాయకులు స్పందిస్తున్నారు.
తాజాగా కరీనా కపూర్ మాజీ ప్రియుడు నటుడు షాహిద్ కపూర్ కూడా ఈ ఘటనపై స్పందించాడు. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం దేవా. ఈ సినిమాకు మలయాళ దర్శకుడు ఆండ్రోస్ దర్శకత్వం వహిస్తుండగా.. పూజ హెగ్దే కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమా జనవరి 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్స్‌లో పాల్గోన్న షాహిద్‌ని మీడియా సైఫ్ అలీఖాన్ ఘటనపై ప్రశ్నించగా..
షాహిద్ మాట్లాడుతూ.. ఇది దురదృష్టకరమైన సంఘటన. ఈ విషయంలో నాతో పాటు మా టీమ్ కూడా చాలా ఆందోళన చెందుతుంది. ఈ సంఘటనతో మేమందరం చాలా షాక్‌కు గురయ్యాము. సైఫ్ అలీఖాన్ ఆరోగ్యం త్వరగా మెరుగుపడి త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను అంటూ షాహిద్ చెప్పుకోచ్చాడు.
సైఫ్ అలీఖాన్ కంటే ముందు కరీనా కపూర్ షాహిద్ కపూర్‌తో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. 2004 నుంచి షాహిద్‌తో డేటింగ్లో ఉన్న కరీనా జబ్ వీ మెట్ సినిమా సమయంలో అతడితో విడిపోయింది. అనంతరం తషాన్ (2007) సినిమా సమయంలో సైఫ్‌తో ప్రేమలో పడింది. 2012లో వీరిద్దరు పెళ్లి చేసుకున్నారు.