DD Next level | ప్రముఖ తమిళ నటుడు సంతానం నటించిన హారర్ కామెడీ చిత్రం ‘డీడీ నెక్స్ట్ లెవెల్’ వివాదంలో చిక్కుకుంది. ఈ చిత్రంలోని ‘కిస్సా 47’ అనే పాట తిరుపతి శ్రీవెంకటేశ్వర స్వామిని అవమానించేలా ఉందని ఆరోపిస్తూ సేలంకు చెందిన బీజేపీ లీగల్ టీమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ప్రేమ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ‘డీడీ నెక్స్ట్ లెవెల్’ ట్రైలర్ ఇటీవల విడుదలై మంచి స్పందన అందుకుంది. ఈ చిత్రానికి ఆఫ్రో సంగీతం అందించారు. సంతానంతో పాటు గౌతం వాసుదేవ్ మీనన్, సెల్వరాఘవన్, నిజల్గల్ రవి, రెడ్డిన్ కింగ్స్లీ వంటి ప్రముఖ నటులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం మే 16న విడుదల కాబోతుంది.
ఇప్పటికే విడుదలైన ‘కిస్సా 47’ పాటలో సంతానం సినీ విమర్శకుడి పాత్రలో కనిపించనున్నాడని విడుదలైన ట్రైలర్ ద్వారా తెలుస్తోంది. కెలుతి సాహిత్యం అందించిన ఈ పాటకు ఇంటర్నెట్లో విశేషమైన స్పందన లభించింది. అయితే, ఈ పాటలో ఉపయోగించిన ‘గోవింద గోవింద’ అనే పదాలు హిందువుల అత్యంత పవిత్ర స్థలమైన తిరుపతి ఎలుమలయన్(ఏడుకొండలు) ఆలయాన్ని, హిందువుల ఆరాధనా సంప్రదాయాలను కించపరిచే ఉద్దేశ్యంతో వాడారని ఫిర్యాదులో పేర్కొన్నారు. భగవంతుడికి అంకితం చేయబడిన భక్తి గీతాలలో వినిపించే ఈ పవిత్రమైన పదాలను పాటలో దుర్వినియోగం చేశారని ఆరోపిస్తూ, వెంటనే ఈ పాటను సినిమా నుండి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.
సేలం మున్సిపల్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో దాఖలైన ఫిర్యాదులో, నటుడు సంతానం మరియు ‘డీడీ నెక్స్ట్ లెవెల్’ చిత్ర యూనిట్‌పై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీజేపీ లీగల్ టీమ్ గట్టిగా కోరింది. అయితే సినిమా విడుదలకు కేవలం నాలుగు రోజుల వ్యవధి ఉండగానే ఈ వివాదం తలెత్తడం ‘డీడీ నెక్స్ట్ లెవెల్’ చిత్ర బృందానికి పెద్ద తలనొప్పిగా మారింది. దాదాపు రెండు నెలల క్రితం విడుదలైన ఈ పాటపై ఇప్పుడు అకస్మాత్తుగా ఫిర్యాదు నమోదు కావడం గమనార్హం. ఈ పరిణామాల నేపథ్యంలో సినిమా విడుదల విషయంలో ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయో చూడాల్సి ఉంది.