Actor Sajjad | టైగర్ జిందా హై సినిమాతో మంచి నటుడిగా పేరు సంపాదించుకున్న సజ్జాద్ డెలాఫ్రూజ్.. తన కుటుంబం గురించి ఆందోళన చెందుతున్నాడు. ఇరాన్ మూలాలున్న ఈ నటుడు గత మూడు రోజులుగా నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. మూడు భూకంపాలు సంభవించి తుర్కియేతోపాటు సిరియా, ఇరాన్లో కూడా విధ్వంసం జరిగింది. అయితే, ఇరాన్లో దీని ప్రభావం చాలా తక్కువగా ఉన్నదనే చెప్పాలి. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో నివసిస్తున్న తన కుటుంబం యోగక్షేమాలు తెలియక నిన్నటి వరకు సజ్జాద్ బాధపడ్డాడు. స్నేహితులకు ఫోన్ చేసి వారి ద్వారా కుటుంబం క్షేమంగా ఉన్నదని తెల్సుకుని ఇప్పుడిప్పుడే స్థిమితపడుతున్నాడు.
భూకంపం విధ్వంసం గురించి తెలిసినప్పటి నుంచి చాలా బాధపడ్డానని, తన కళ్లలో నీళ్లు తిరిగాయని సజ్జాద్ చెప్పాడు. అంతర్జాతీయ మీడియా ఎక్కువగా తుర్కియే గురించే కవరేజీ ఇస్తున్నదని, ఇరాన్, సిరియాలో కూడా నష్టం జరిగిందని ఆయన అన్నారు. భూకంపం కారణంగా కుటుంబంతో తనకు కమ్యూనికేషన్ లేకుండా పోయిందని విచారం వ్యక్తం చేశారు. దాంతో చాలా కలత చెందానని, బాధగా ఉన్నదని చెప్పాడు. తన దేశ ప్రజలకు సేవ చేయలేక నిస్సహాయంగా ఉన్నందుకు సిగ్గుపడుతున్నానన్నారు. నిత్యం చనిపోతున్న తన వారిని చూస్తూ ఎంతో మదనపడుతున్నట్లు చెప్పారు. తన కుటుంబాన్ని కలిసేందుకు సజ్జాద్ గత ఏడాది అక్టోబర్‌లో ఇరాన్ వెళ్లాడు.
‘టర్కీ, ఇరాన్‌లోని స్నేహితులతో మాట్లాడాను. నా కుటుంబ సభ్యులు క్షేమంగా ఉన్నారని తెలుసుకున్నాను. వారితో మాట్లాడలేకపోతున్నాను. అందుకే వారు నిజంగా సురక్షితంగా ఉన్నారా లేదా అని నేను భయపడుతున్నాను. అంతా బాగానే ఉంటుందని భావిస్తున్నాను. అయితే ఈ సమయంలో వారు ఎంతగా ఇబ్బంది పడుతున్నారో నాకు తెలుసు. తుర్కియే, సిరియాలో శిథిలాల కింద చిక్కుకుపోయిన వారి సమాచారం తెలుసుకోవచ్చు. అదే ఇరాన్లో రాజకీయ పరిస్థితులు అధ్వానంగా ఉండటంతో అక్కడి విషయాలు తెలుసుకోవడం కష్టంగా ఉన్నది. కనీసం సోషల్ మీడియాను ఉపయోగించలేని పరిస్థితులు ఉన్నాయి’ అని సజ్జాద్ పేర్కొన్నారు.