ప్రశాంత్‌వర్మ దర్శకత్వంలో రూపొందిన ‘హనుమాన్’ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘జై హనుమాన్’ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్రం త్వరలో సెట్స్‌మీదకు వెళ్లనుంది. ఈ సినిమాలో హనుమాన్ పాత్రను ఓ అగ్ర హీరో పోషిస్తారని దర్శకుడు ప్రశాంత్‌వర్మ ఇదివరకే వెల్లడించారు. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మరింతగా అంచనాలు పెరిగాయి. హనుమాన్ పాత్రను పోషించే అవకాశం ‘కాంతార’ ఫేమ్ రిషబ్‌శెట్టిని వరించింది. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని బుధవారం హనుమాన్ పాత్రలో రిషబ్‌శెట్టి ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఇందులో ఆయన రాముడి విగ్రహాన్ని భక్తిపూర్వకంగా పట్టుకొని కనిపిస్తున్నారు. శ్రీరాముడికి హనుమంతుడు ఇచ్చిన మాటేమిటి అనే అంశం చుట్టూ సీక్వెల్ కథ నడుస్తుందని చెబుతున్నారు. ‘హనుమాన్’ చిత్రంలో హనుమంతు అనే పాత్రలో కనిపించిన హీరో తేజ సజ్జా..సీక్వెల్లోనూ అదే పాత్రను పోషిస్తున్నారు. ‘ప్రశాంత్‌వర్మ సినిమాటిక్ యూనివర్స్’లో భాగంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. ‘జై హనుమాన్’ భక్తి, విధేయతలతో కూడిన ఎపిక్ చిత్రమని, ప్రేక్షకులకు అద్భుతమైన అనుభూతినందిస్తుందని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్నారు.