Actor Rajesh Kumar | బాలీవుడ్ ప్రముఖ సిట్కామ్ ‘సారాభాయ్ వర్సెస్ సారాభాయ్’ సీరియల్తో రోమేష్ సారాభాయ్గా కోట్లాది మంది ప్రేక్షకులను అలరించిన ప్రముఖ నటుడు రాజేష్ కుమార్ జీవితంలో ఊహించని కష్టాలు ఎదురయ్యాయి. ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్ మాటలతో ప్రేరణ పొందిన అతడు, నటనకు దూరంగా ఉంటూ వ్యవసాయం బాట పట్టి చివరకు దాదాపు రూ. 2 కోట్ల అప్పులపాలయ్యారు. ఈ విషయాన్ని తాజాగా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకోచ్చాడు.
2017లో సద్గురు చేపట్టిన ‘ర్యాలీ ఫర్ రివర్స్’ ప్రచారంలో పాల్గొన్న రాజేష్ కుమార్.. “మీ రాష్ట్రం నుంచి నాకు వంద మంది యువకులను ఇవ్వండి, వ్యవసాయ రూపురేఖలను మారుస్తా.. కానీ మూడేళ్లపాటు దాని గురించి మాత్రం నన్ను ఏమీ అడగవద్దంటూ సద్గురు చెప్పిన వ్యాఖ్యలకు ప్రభావితమై 2017లో నటనకు స్వస్తి చెప్పి తన స్వస్థలమైన బీహార్లోని గయాకు వెళ్లి వ్యవసాయంపై మక్కువతో ఆ రంగంలోకి అడుగుపెట్టారు రాజేష్.
అయితే, ఆయన వ్యవసాయ ప్రయాణం ఏమాత్రం సాఫీగా సాగలేదు. మొదట్లో ప్లాంటేషన్ పనులు ప్రారంభించగా, సరిగ్గా అప్పుడే ఆ ప్రాంతంలో 35 ఏళ్ల తర్వాత భారీ వరదలు వచ్చి అంతా నాశనం చేశాయి. ఆ తర్వాత మరోసారి 15 వేల చెట్లను నాటగా, కోవిడ్ మహమ్మారి అడ్డంకిగా మారింది. చివరి ప్రయత్నంగా బోర్లు వేయడానికి ప్రయత్నిస్తే, నీటి జాడ లేక 500 అడుగుల లోతు వరకు నీటి చుక్క కూడా పడలేదు. ఇలా వరుస వైఫల్యాలు, చేతిలో ఆదాయం లేకపోవడంతో ఆయన దాదాపు రూ. 2 కోట్ల వరకు అప్పులపాలయ్యారు. ఈ కష్టకాలంలో పూట గడవడం కూడా కష్టమైపోయి, చివరికి తన కొడుకు చదువుతున్న పాఠశాల బయటే కూరగాయలు అమ్మే దుస్థితికి చేరుకున్నట్లు తెలిపారు.
అయితే ఆధ్యాత్మికత వలన తాను ఎలాంటి డిప్రెషన్ లేదా ఆందోళనకు గురికాలేదని రాజేష్ కుమార్ తెలిపారు. ఈ ప్రయాణాన్ని తాను వైఫల్యంగా చూడనని, ఎంతో నేర్చుకున్నానని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన ఆర్థిక పరిస్థితి కుదుటపడటంతో అప్పులన్నీ తీరిపోయి, కేవలం 10 నుంచి 15 శాతం మాత్రమే మిగిలి ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం ఆయన మళ్లీ బాలీవుడ్లోకి రీఎంట్రీ ఇచ్చి పలు సినిమాల్లో నటిస్తున్నారు.