Actor Rajendra Prasad : సినీ నటుడు (Cinema Actor) రాజేంద్రప్రసాద్ (Rajendra Prasad) ను మాజీ మంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani Srinivas Yadav) పరామర్శించారు. ఇటీవల రాజేంద్రప్రసాద్ కూతురు గాయత్రి మరణించారు. ఆ విషయం తెలుసుకున్న తలసాని కూకట్‌పల్లిలోని వారి నివాసానికి వెళ్లి గాయత్రి చిత్రపటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు.
అనంతరం రాజేంద్రప్రసాద్, ఇతర కుటుంబ సభ్యులతో తలసాని మాట్లాడారు. వారికి ధైర్యం చెప్పారు. కాగా రాజేంద్రప్రసాద్ కుమార్తె గాయత్రి (38) గుండెపోటుతో కన్నుమూశారు. గత శనివారం ఆమెకు ఛాతిలో నొప్పి రావడంతో హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గాయత్రి తుదిశ్వాస విడిచారు.
కాగా, రాజేంద్రప్రసాద్‌కు కుమార్తె గాయత్రితోపాటు ఒక కుమారుడు కూడా ఉన్నారు. గాయత్రిది ప్రేమ వివాహం. ఆమెకు ఓ కూతురు ఉంది. కూతురు అకాల మరణంతో రాజేంద్రప్రసాద్ తీవ్ర మానసిక ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో ఆయనను పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కలిసి పరామర్శిస్తున్నారు.