Script Craft | తెలుగు సినీరంగంలో ఔత్సాహిక రచయితలను ప్రోత్సహించే లక్ష్యంతో రూ పొందించిన ‘ది స్క్రిప్ట్ క్రాఫ్ట్’ వెబ్‌సైట్‌ను అగ్ర నటుడు ప్రభాస్ సోషల్ మీడియా ద్వారా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫొటోను షేర్ చేశారు. ‘మీ కథల ను ఈ వేదిక ద్వా రా పంచుకోండి. మంచి కథలతో మీ ప్రతిభను ప్రపంచానికి తెలియజేయండి. మీ కథలతో కలల్ని నిజం చేసుకునేందుకు ఇదొక మంచి వేదిక’ అంటూ ప్రభాస్ ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నారు.
‘రచయితలు తమ స్క్రిప్ట్‌ను 250 పదాల నిడివిలో ‘ది స్క్రిప్ట్ క్రాఫ్ట్’ వెబ్సైట్లో అప్లోడ్ చేసుకోవచ్చు. అత్యధిక రేటింగ్ పొందిన స్క్రిప్ట్‌లను టాప్ ప్లేస్‌లో ఉంచుతాం. మా వెబ్సైట్ తొలి ప్రయత్నంగా మీ ఫేవరేట్ హీరోకు సూపర్‌పవర్స్ వస్తే ఎలా ఉంటుందనే కాన్సెప్ట్‌తో స్క్రిప్ట్‌లను ఆహ్వానిస్తున్నది’ అని వెబ్సైట్ ఫౌండర్స్ ప్రమోద్ ఉప్పలపాటి, వైష్ణవ్ పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రభాస్ రాజాసాబ్, సలార్-2, కల్కి-2 చిత్రాలతో పాటు హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలతో బిజీగా ఉన్నారు.