ఇటీవల విడుదలైన ‘దసరా’ చిత్రంతో కెరీర్లోనే అపూర్వ విజయాన్ని దక్కించుకున్నారు హీరో నాని. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా వందకోట్ల వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా తాలూకు విజయాన్ని ఆస్వాదిస్తూనే మరోవైపు తన 30వ సినిమా షూటింగ్లో నాని బిజీగా ఉన్నారు. నూతన దర్శకుడు శౌర్యవ్ రూపొందిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 21న ప్రేక్షకుల ముందుకురానుంది.
ఇదిలావుండగా వెంకటేష్ కథానాయకుడిగా శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందిస్తున్న ‘సైంధవ్’ చిత్రంలో నాని అతిథి పాత్రలో నటించబోతున్నారు. ఈ విషయాన్ని దర్శకుడు శైలేష్ కొలను తన ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. ‘హిట్’ ఫ్రాంచైజీలో వచ్చిన తొలి రెండు చిత్రాల ద్వారా దర్శకుడు శైలేష్ కొలను మంచి గుర్తింపు పొందారు. ‘హిట్-2’ చిత్ర నిర్మాణంలో పాలుపంచుకున్న నాని..మూడో భాగంలో హీరోగా నటించబోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న ‘సైంధవ్’లో నాని అతిథి పాత్రలో కనిపించనుండటం విశేషం.