‘దేశంలో పరిస్థితి సెన్సిటివ్‌గా ఉంది కదా.. ఇలాంటి సమయంలో సినిమా సెలబ్రేషన్స్ చేయడం కరక్టేనా.. అనే చర్చ మా మధ్య జరిగింది. ఓవైపు శత్రువులు మన దేశంలో సృష్టించిన రక్తపాతానికి, సరిహద్దుల్లో మన సైనికులు సరైన సమాధానం చెబుతున్నారు. తాము చేసిన దుశ్చర్య వల్ల ఇండియాలో ఒకచోట సెలబ్రేషన్స్ క్యాన్సిల్ అయ్యాయి.. అనే సాటిస్ఫాక్షన్ కూడా శత్రువులకు మేం ఇవ్వదలచుకోలేదు. అందుకే ఈ సెలబ్రేషన్స్ చేస్తున్నాం’ అని నాని అన్నారు.
ఆయన కథానాయకుడిగా శైలేష్ కొలను దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘హిట్: The 3rd case’. ప్రశాంతి తిపిర్నేని నిర్మాత. ఈ నెల 1న సినిమా విడుదలైంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ సినిమా బ్లాక్‌బస్టర్ సక్సెస్‌మీట్‌లో నాని మాట్లాడారు. ఇంకా చెబుతూ ‘ఒక క్రైమ్ థ్రిల్లర్‌ని ఒక బిగ్ మాస్ కమర్షియల్ సినిమాగా సెలబ్రేట్ చేసుకోవడం చాలా ఆనందాన్నిచ్చింది. ఈ సందర్భంగా ఈ సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరున కృతజ్ఞతలు తెలుపుతున్నాను.
దర్శకుడు శైలేష్‌తో వర్క్ చేయడం ఫన్‌గా ఉంటుంది. తను చాలా కూల్. అద్భుతమైన కామెడీ టైమింగ్ కూడా తనలో ఉంది. తనతో నేను చేయబోయే నెక్ట్స్ సినిమా కామెడీ ఎంటైర్టెనర్ అవ్వాలని కోరుకుంటున్నా. అలాగే ‘హిట్ 2’ సందడి థియేటర్లలో కంటిన్యూ కావాలని ఆశిస్తున్నా.’ అని పేర్కొన్నారు నాని. ఇంకా శైలేష్ కొలను, అడివి శేషు, శ్రీనిధి శెట్టి, ప్రొడ్యూసర్ దీప్తి, పావని, శ్రీనాథ్ మాగంటి, అమిత్, ప్రొడక్షన్ డిజైనర్ నాగేంద్ర కూడా మాట్లాడారు.