హైదరాబాద్‌లోని ప్రముఖ సినీ స్టూడియో అన్నపూర్ణ స్టూడియోస్ ఏర్పాటు చేసి యాభైఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా అగ్ర నటుడు అక్కినేని నాగార్జున స్పెషల్ వీడియోను విడుదల చేశారు. రోడ్లులేని రోజుల్లో నాన్న ఇంత పెద్ద స్టూడియోను నిర్మించారని, ఎంతో మంది టెక్నీషియన్స్, ఆర్టిస్టులు, దర్శకులకు అన్నపూర్ణ స్టూడియో ఉపాధి కల్పించిందని నాగార్జున గుర్తుచేసుకున్నారు. ‘విజయాలు సాధించిన ప్రతీ పురుషుడి వెనక ఓ మహిళ ఉంటుందని నాన్న నమ్మేవారు. ఆయన విజయాలకు కూడా అమ్మే కారణమని ఆయన బలంగా విశ్వసించేవారు. అందుకే స్టూడియోకు అన్నపూర్ణ అని నామకరణం చేశారు.
అమ్మానాన్నలకు ఇష్టమైన ప్రదేశాల్లో ఈ స్టూడియో ఒకటి. 50 ఏళ్ల క్రితం సంక్రాంతి పండగ సందర్భంగా అన్నపూర్ణ స్టూడియో ప్రారంభమైంది. ఆ తర్వాత ప్రతి సంక్రాంతికి అమ్మానాన్న అన్నపూర్ణ స్టాప్‌తో కలిసి భోజనాలు చేసేవారు. ఆ సంప్రదాయాన్ని ఇప్పటికీ కొనసాగిస్తున్నాం. అన్నపూర్ణ స్టాఫ్‌ని మేము ఫ్యామిలీగా భావిస్తాం. వారి వల్లే ఈ రోజు స్టూడియో కళకళలాడుతోంది. నేను, నా పిల్లలు నాన్నను స్ఫూర్తిగా తీసుకుంటాం. మా ఫ్యామిలీ ఒక్కరికే కాదు.. బయట చాలా మంది జీవితాలకు నాన్న స్ఫూర్తిగా నిలిచారు. ఏఎన్నార్ లివ్స్ ఆన్. అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు’ అని నాగార్జున వీడియోలో పేర్కొన్నారు.