Manobala Cine Carrier | తమిళ హాస్యనటుడు, దర్శకుడు మనోబాల మరణంతో కోలీవుడ్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన మృతి పట్ల పలువురు కోలీవుడ్ సినీ నటులు సంతాపం ప్రకటిస్తున్నారు. తమిళనాడులోని నాగర్‌కోయిల్‌లో 1953 డిసెంబర్ 3న మనోబాల జన్మించాడు. పదిహేడేళ్లకే సినీరంగలోకి ఎంట్రీ ఇచ్చి పలు విభాగాల్లో పనిచేశాడు. అయితే కమల్ హాసన్ ప్రోత్సాహంతో 1979లో భారతీరాజా డైరెక్షన్లో ‘పుతియ వార్పుగల్’ సినిమాలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా అవకాశం ఇప్పించాడు. అదే సినిమాలో ఓ చిన్న పాత్రలో కూడా మెరిసాడు. ఆ తర్వాత ఏడాది భారతి రాజా ‘నిరమ్ మారంత పూకల్’ సినిమాలో నటుడిగా మరో చాన్స్ ఇచ్చాడు.
ఆ తర్వాత వరుసగా నటుడిగా అవకాశాలు అందిపుచ్చుకుంటూనే వచ్చాడు. ఓ వైపు నటుడిగా రాణిస్తూనే 1982లో ‘ఆగయ గంగాయ్’ అనే రోమ్-కామ్ సినిమా తెరకెక్కించాడు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. దాంతో మళ్లీ నటనపై అడుగులు వేసి బిజీ అయిపోయాడు. అయితే దర్శకుడిగా సక్సెస్ అవ్వాలన్న ఆశ చావక మళ్లీ మూడేళ్లకు ‘నాన్ ఉంగల్ రసిగన్’, ‘పిల్లై నిలా’ అనే రెండు సినిమాలకు దర్శకత్వం వహించాడు. ఆ రెండు సినిమాలు కమర్షియల్‌గా మంచి విజయాలు సాధించాయి. దాంతో దర్శకుడిగానూ మనోబాల తెగ బిజీ అయిపోయాడు.
కేవలం తమిళంలోనే కాకుండా కన్నడలో, హిందీలోనూ మనోబాల దర్శకుడిగా సినిమాలు చేశాడు. సినిమాలే కాకుండా పలు సీరియల్స్ కూడా మనోబాల దర్శకత్వం వహించాడు. ఇక కమెడియన్‌గా మనోబాల ఎన్నో వందల సినిమాల్లో మెప్పించాడు. ముఖ్యంగా 2003 నుంచి ఇప్పటివరకు నటుడిగా తీరక లేకుండా గడిపాడు. ప్రతి ఏటా పది, పదిహేను సినిమాలతో ఫుల్ బిజీగా ఉండేవాడు. ఇప్పటివరకు మనోబాల నటుడుగా 450కి పైగా చిత్రాల్లో నటించాడు. పలు డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన మనోబాల తెలుగులోనూ కొన్ని సినిమాలు చేశాడు.
‘పున్నమినాగు’, ‘గగనం’, ‘మనసును మాయ సేయకే’, ‘డేగ’, ‘ఊపిరి’, ‘రాజా ధి రాజా’, ‘మహానటి’, ‘దేవదాసు’, ‘రాజ్‌ధూత్’ వంటి సినిమాల్లో మెప్పించాడు. ఇక ఈ ఏడాది సంక్రాంతి బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన వాల్తేరు వీరయ్య సినిమాలోనూ మనోబాల కనిపించాడు. ఈ సినిమాలో మనోబాల జడ్జి పాత్ర పోషించాడు. ముప్పై ఏళ్ల సినీ ప్రస్థానంలో మనోబాల నటుడిగా 450 సినిమాలు, దర్శకుడిగా 24 సినిమాలు, మూడు సీరియల్స్ చేశాడు. ప్రొడ్యూసర్‌గానూ మనోబాల రెండు సినిమాలు నిర్మించాడు. మూడోది చర్చల స్థాయిలో ఉంది. ఇక నటుడిగా మనోబాల చివరి చిత్రం కాజల్ నటించిన ‘ది ఘోస్టీ’.