Actor Lakshmi | నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ‘ది రాయల్స్ అనే వెబ్ సిరీస్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లో బోల్డ్ కంటెంట్ ఎక్కువయ్యిందని కొందరూ కామెంట్లు చేస్తుండగా.. మరికొందరు ఈ సిరీస్‌లో రాజకుటుంబాలను చూపిన విధానాన్ని విమర్శిస్తున్నారు. ఇషాన్ ఖత్తర్, భూమి పెడ్నేకర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో మే 9న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ వెబ్ సీరిస్‌కు నెగిటివిటీ వస్తున్న నేపథ్యంలో, తెలుగు నటి లక్ష్మీ మంచు ఈ షోకు గట్టి మద్దతుగా నిలిచారు.
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గోన్న మంచు లక్ష్మీ మాట్లాడుతూ.. ఈ సిరీస్‌ను “మైండ్-నమ్మింగ్” (మెదడును ప్రశాంతంగా ఉంచేది) అని ప్రశంసించారు. ది రాయల్స్ని విమర్శిస్తూ, ఇది నెట్‌ఫ్లిక్స్ స్థాయి షో కాదని అంటున్న వారందరికీ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఇషాన్ చాలా హాట్‌గా కనిపించాడు, భూమి అద్భుతమైన దుస్తులు ధరించింది. ఇది మెదడును ప్రశాంతంగా ఉంచే షో, నాకు కావాల్సింది అదే” అని ఆమె అన్నారు.
నాకు లోతైన, అర్థవంతమైన నటన అవసరం లేదు. భూమి గతంలో అలాంటివి చాలా చేసింది. ఆమె అద్భుతమైన నటి అని నాకు తెలుసు. కానీ, ఇక్కడ ఆమె సరదాగా, అందమైన దుస్తులతో భారతదేశపు రాజరికాన్ని చూపిస్తోంది” అని పేర్కొన్నారు. “మనం ఎంత స్లమ్మిగా ఉన్నామో చూసి అలసిపోలేదా? ‘పాతాళ్ లోక్’ ఎంత గొప్పగా ఉన్నా, అది సంపన్నమైనది కాదు, ఆనందాన్ని ఇవ్వదు. కొంత వైభవం, ఆనందం, అర్థంలేని సరదాను చూడటం మంచిది కాదా?” అని ఆమె అభిమానులను ప్రశ్నించారు. కాగా ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
‘ది రాయల్స్’ సిరీస్ విషయానికి వస్తే.. ప్రియాంక ఘోష్ ఈ సిరీస్‌కి దర్శకత్వం వహించగా, నేహా వీణా శర్మ రచించారు. రంగితా ప్రీతిష్ నంది, ఇషితా ప్రీతిష్ నంది దీనిని సృష్టించారు. ప్రీతిష్ నంది కమ్యూనికేషన్స్ ఈ షోను నిర్మించింది. ఇషాన్ ఖత్తర్, భూమి పెడ్నేకర్‌తో పాటు, సాక్షి తన్వర్, జీనత్ అమన్, విహాన్ సమత్, నోరా ఫతేహి, డీనో మోరియా, మిలింద్ సోమన్, చుంకీ పాండే, ల్యూక్ కెన్నీ, శ్వేతా సాల్వే వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో నటించారు.