Kasthuri Arrest : తెలుగు మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నటి కస్తూరి(Kasthuri)ని పోలీసులు అరెస్ట్ చేశారు. నవంబర్ 3 నుంచి పరారీలో ఉన్న ఆమెను హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో తమిళ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆమెను అక్కడి నుంచి ప్రత్యేక వాహనాల్లో చెన్నైకి తరలిస్తున్నారు.
ఈ నెల 3న చైన్నైలో జరిగిన ఓ కార్యక్రమానికి నటి కస్తూరి హాజరయ్యారు. అక్కడి జనాలను ఉద్దేశించి మాట్లాడుతూ తమిళ రాజులకు సేవ చేసుకునేందుకు వచ్చిన వారే తెలుగువారంటూ వ్యాఖ్యానించి వివాదంలో చిక్కుకున్నారు. ఆమె వ్యాఖ్యాలపై కొందరు పోలీసులను ఆశ్రయించారు. దాంతో, కస్తూరి ముందస్తు బెయిల్ కోసం మద్రాస్ హైకోర్టు(Madras High Court)ను ఆశ్రయించింది. కానీ, సదరు హైకోర్టు ఆమెకు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. అందుకని పోలీసులకు చిక్కకూడదనే ఉద్దేశంతో ఆమె ఫోన్ స్విచాఫ్ చేసి హైదరాబాద్‌లో తలదాచుకుంది.
BREAKING :
Chennai Police arrested actress Kasturi in Hyderabad for making obscene comments on Telugu women. pic.twitter.com/2yvpZZLALY
— Siddhu Manchikanti Potharaju ☭ (@SiDManchikanti) November 16, 2024
300 సంవత్సరాల కిందట ఒక రాజు వద్ద అంతఃపుర మహిళలకు సేవ చేసేందుకు వచ్చిన తెలుగు వారు.. ప్రస్తుతం ‘మాది తమిళ జాతి’ అంటున్నారన్నారు. ఎప్పుడో ఇక్కడకు వచ్చిన బ్రాహ్మణులను తమిళులు కాదని చెప్పేందుకు మీరెవరంటూ ద్రవిడ సిద్ధాంత వాదులపై ఆమె మండిపడ్డారు. ఇతరుల ఆస్తులను లూటీ చేయొద్దని.. ఇతరుల భార్యలపై మోజుపడొద్దని, ఒకరికంటే ఎక్కువ మంది భార్యలను చేసుకోవద్దని బ్రాహ్మణులు చెబుతుండడంతోనే తమిళనాడులో వారికి వ్యతిరేకంగా ప్రచారం జరుగుతోందంటూ కస్తూరి విమర్శించారు.
కస్తూరి వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో ఆమె క్షమాపణలు చెప్పారు. తన వ్యాఖ్యలను వక్రీకరించారని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై మహాజన సంఘం రాష్ట్ర సభ్యుడు ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది.
ఒకప్పుడు మద్రాస్‌గా పిలిచే చెన్నైలో పుట్టిన కస్తూరి హై స్కూల్ రోజుల్లోనే మోడలింగ్ చేసింది. 1992లో మిస్ మద్రాస్ టైటిల్ గెలపొందని కస్తూరికి సినిమా అవకాశాలు వచ్చాయి. అదే ఏడాది ఆమె తెరంగేట్రం చేసింది. స్టార్ హీరో ప్రభు గణేశన్ సరసన నటించి మంచి మార్కులు కొట్టేసింది. ఆ తర్వాత శంకర్ రూపొందించిన భారతీయుడు సినిమాలో కమల్ హాసన్ కూతురిగా మంచి అభినయం కనబరిచిన కస్తూరి.. నాగార్జున ప్రధాన పాత్రలో నటించిన అన్నమయ్య సినిమాలో కీలక పాత్ర పోషించింది.