ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చి.. సొంత టాలెంట్‌తో ఇండస్ట్రీలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు నటుడు కార్తీక్ ఆర్యన్. ఒకపక్క మంచి సినిమాలు చేస్తూనే.. పెద్ద సినిమాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నాడు. కార్తీక్ ఆర్యన్ నటించిన తాజా చిత్రం ‘చందు ఛాంపియన్’. కబీర్ ఖాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ స్పోర్ట్స్ డ్రామాలో శ్రద్ధా కపూర్ హీరోయిన్గా నటించారు. జూన్ 14న విడుదలైన ‘చందు ఛాంపియన్’ ప్రేక్షకులను అలరిస్తున్నది. కాగా, ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా కార్తీక్ చేసిన కామెంట్లు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
అవేంటో ఆయన మాటల్లోనే.. ‘నేను ఎవరితోనో డేటింగ్లో ఉన్నాననే చర్చ.. ఈ మధ్య సోషల్‌మీడియాలో హల్చల్ చేసింది. ఆ చర్చ ఇంకా కొనసాగుతూనే ఉన్నది. నిజం చెప్పాలంటే.. నేను ఎవరితోనూ డేటింగ్లో లేను. సెలెబ్రిటీ హోదా వచ్చిన తర్వాత.. బయట కూడా భయంభయంగానే తిరుగుతున్నా. మిత్రులను కూడా తక్కువగా కలుస్తున్నా. చాలామంది నన్ను రొమాంటిక్ హీరో అని పిలుస్తుంటారు. కానీ ప్రేమ విషయంలో మాత్రం నేను ఎప్పుడూ దురదృష్టవంతుణ్నే. డబ్బు, పాపులారిటీ వచ్చిన తర్వాత నచ్చిన వస్తువులను కొనుక్కోగలం. కానీ, ప్రేమను మాత్రం కొనలేం. అందుకే నా జీవితానికి సరిపడే సరైన వ్యక్తి కోసం ఎదురుచూస్తున్నాను’ అని చెప్పుకొచ్చాడు కార్తీక్ ఆర్యన్.