“సర్దార్ 2’లో స్పై క్యారెక్టర్ చేశాను. ఇలాంటి పాత్ర దొరకడం అదృష్టం. కమల్‌హాసన్‌గారికి ‘ఇండియన్’తో ఎంత పేరొచ్చిందో, ‘సర్దార్’తో నాకు అంత పేరొచ్చింది. ఈ నెల 10న ‘సర్దార్ 2’ రాబోతోంది. ఇది నా కెరీర్లోనే చాలా ముఖ్యమైన సినిమా. హాలీవుడ్ స్థాయిలో సినిమా ఉంటుంది. ఇందులో హీరోయిన్లిద్దరూ డ్యాన్స్ చేయరు. యాక్షన్ మాత్రమే చేస్తారు. ఈ సినిమాలో ఉమెన్ పవర్ చూస్తారు. ఇక ఎస్.జె.సూర్య ఇందులో నెక్ట్స్ లెవల్లో కనిపిస్తారు. ఆయనది టైలర్‌మేడ్ క్యారెక్టర్.
నెక్ట్స్ కల్యాణ్ శంకర్ దర్శకత్వంలో తెలుగు సినిమా చేస్తున్నా. ఆ సినిమా మిమ్మల్ని బాగా నవ్విస్తుంది. ‘హిట్ 4’ కూడా వస్తుంది’ అని అగ్ర కథానాయకుడు కార్తీ అన్నారు. ఆయన కథానాయకుడిగా రాబోతున్న చిత్రం ‘సర్దార్ 2’. బ్లాక్‌బస్టర్ ‘సర్దార్’కి ఈ సినిమా సీక్వెల్. పీఎస్ మిత్రన్ దర్శకుడు. ప్రిన్స్ పిక్చర్స్ పతాకంపై ఎస్.లక్ష్మణ్‌కుమార్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 10న విడుదల కానున్నది. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీరిలీజ్ ఈవెంట్లో కార్తీ మాట్లాడారు.
నటుడు ఎస్.జె.సూర్య మాట్లాడుతూ ‘ఈ సినిమా డబుల్ ఎైగ్జెట్మెంట్ ఇస్తుంది. కంటెంట్ కొత్తగా ఉంటుంది. దర్శకుడు మిత్రన్ అద్భుతంగా సినిమా తీశారు. కార్తీ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. భవిష్యత్ తరానికి కావాల్సిన మెసేజ్ ఈ సినిమాలో ఉంది. ఇది సాధారణమైన సినిమా కాదు. మనసులో పెట్టుకోవాల్సిన సినిమా’ అని పేర్కొన్నారు. ఇంకా అషికా రంగనాథన్, మాళవిక మోహనన్‌లతో పాటు సూర్యదేవర నాగవంశీ, అడివి శేష్, బోయపాటి శ్రీను, మైత్రీ రవిశంకర్, అనిల్ సుంకర, కళ్యాణ్ శంకర్, భోగవల్లి ప్రసాద్, అభిషేక్ అగర్వాల్ కూడా మాట్లాడారు.