Actor Darshan | కన్నడ నటుడు దర్శన్ తూగుదీప బెంగళూరు పోలీసులు గురువారం అరెస్టు చేశారు. రేణుక స్వామి హత్య కేసులో దర్శన్‌కు ఇచ్చిన బెయిల్‌ను సుప్రీంకోర్టు రద్దు చేసిన కొద్ది గంటల్లోనే అరెస్టు చేయడం గమనార్హం. దర్శన్‌తో పాటు అతని స్నేహితురాలు పవిత్ర గౌడను సైతం బెంగళూరు పోలీసులు అరెస్టు చేయగా.. ఇద్దరిని ట్రయల్‌కు కోర్టులో హాజరుపరుస్తారు. వైద్య పరీక్షల తర్వాత ఇద్దరిని జైలుకు తరలించనున్నారు. రేణుకస్వామి హత్య కేసులో దర్శన్‌కు ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయాలని కర్నాటక ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దర్శన్‌కు బెయిల్ ఇవ్వడం వల్ల సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని వాదనలు వినిపించింది.
ఈ మేరకు ఇరువర్గాల వాదనలు విన్న జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ ఆర్ మహాదేవన్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం బెయిల్ రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇదే కేసులో సహ నిందితులు అయిన ప్రదూష్, లక్ష్మణ్ ఎం, నాగరాజు ఆర్‌లను సైతం పోలీసులు అరెస్టు చేశారు. అనుకుమార్, జగదీష్‌లను సైతం త్వరలోనే అరెస్టు చేయనున్నట్లు పేర్కొన్నారు. దర్శన్‌ను బళ్లారిలోని సెంట్రల్ జైలకు తరలించే అవకాశం ఉన్నది. బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో పొగ తాగుతూ.. పేరుమోసిన నేరస్తులతో తిరిగుతున్న ఫొటోలు బయటకు వచ్చాయి. ఆ తర్వాత అతన్ని బళ్లారి జైలుకు తరలించారు. చిత్రదుర్గకు చెందిన రేణుకస్వామి అనే దర్శన్ అభిమాని గతేడాది జూన్‌లో హత్యకు గురైన విషయం తెలిసిందే.
ఈ కేసులో దర్శన్, పవిత్ర గౌడతో పాటు మరో 15 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో నిందితులు కర్నాటక హైకోర్టును ఆశ్రయించగా అక్టోబర్‌లో మధ్యంతర బెయిల్ ఇచ్చింది.. అదే ఏడాది డిసెంబర్లో రెగ్యులర్ బెయిల్‌ను మంజూరు చేసింది. దర్శన్, పవిత్ర గౌడతో పాటు ఇతర నిందులకు బెయిల్ ఇవ్వడంపై కర్నాటక సర్కారు సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఈ మేరకు ఏడుగురి నిందితుల బెయిల్‌ను రద్దు చేయాలంటూ స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ విషయంపై పలుసార్లు విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం బెయిల్ ఇవ్వడంపై అసంతృప్తిని వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. తాజాగా బెయిల్‌ను రద్దు చేయడంతో పోలీసులు నటుడు దర్శన్, హీరోయిన్ పవిత్ర గౌడను అరెస్టు చేశారు.