Akhanda Movie | గత కొంత కాలంగా వరుస ఫ్లాప్లతో సతమతవుతున్న బాలకృష్ణకు ‘అఖండ’ ఫుల్ మీల్స్ పెట్టింది. బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఘన విజయాన్ని సాధించింది. గతేడాది డిసెంబర్లో విడుదలైన ఈ చిత్రం టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల ప్రభంజనం సృష్టించింది. ఈ చిత్రంలో అఘోరాగ బాలకృష్ణ నటన ప్రశంసనీయం. హిందూ ధర్మాలు, హిందు టెంపుల్స్ గురించి బోయపాటి చెప్పిన తీరుకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ చిత్రం వెండి తెరపైనే కాకుండా బుల్లితెరపై, ఓటీటలలో కూడా సంచలనాలు సృష్టించాయి. తాజాగా ఈ చిత్రం మరో అరుదైన ఘనతను సాధించింది.
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఒక చిత్రం థియేటర్లో 50రోజులు ఆడిందంటే అది గొప్ప విషయం. అలాంటిది అఖండ చిత్రం ఏకంగా 175రోజులు ఆడింది. గుంటూరులోని చిలకలూరిపేటలో ఉన్న రామకృష్ణ థియేటర్లో అఖండ 175రోజులు పూర్తి చేసుకుంది. దీనిపై థియేటర్ యాజమాన్యం ‘సినిమా విడుదలై ఇన్ని రోజులైనా ప్రేక్షకాదరణ ఏ మాత్రం తగ్గలేదని కలెక్షన్లు బాగానే వస్తుండంటంతో సినిమాను థియేటర్లలో ప్రదర్శిస్తున్నామని’ వెల్లడించారు. ఈ చిత్రానికి సీక్వెల్ కూడా ఉండనున్నట్లు గతంలోనే బోయపాటి చెప్పాడు. ఇక బాలయ్య ప్రస్తుతం గోపిచంద్ మలినేనితో ఓ యాక్షన్ చిత్రాన్ని చేస్తున్నాడు. దీని తర్వాత అనిల్ రావిపూడితో సినిమా చేయనున్నాడు.