రవితేజ హీరోగా నటించిన సినిమా ‘రావణాసుర’. అనూ ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్ష నగార్కర్, పూజిత పొన్నాడ నాయికలుగా నటిస్తున్నారు. సుశాంత్ కీలక పాత్రను పోషిస్తున్నారు. అభిషేక్ పిక్చర్స్, ఆర్టీ టీం వర్క్స్ బ్యానర్స్ పై అభిషేక్ నామా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సుధీర్ వర్మ దర్శకుడు. ఈ నెల 7న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర విశేషాలు తెలిపారు నిర్మాత అభిషేక్ నామా. ఆయన మాట్లాడుతూ…‘ఈ కథను రవితేజ ఫైనల్ చేసి నన్ను పిలిచి సినిమా చేద్దామని చెప్పారు. ఆయన కూడా నిర్మాణంలో భాగస్వామి అయ్యారు. ఈ కథ విన్నప్పటి నుంచే విజయంపై నమ్మకంగా ఉన్నాం. ఇంతవరకు రవితేజ ఈ తరహా సినిమాలో నటించలేదు. ఈ సినిమా చూసిన తర్వాత రవితేజ ఇలా కూడా నటించగలరా? అని ప్రేక్షకులు ఆశ్చర్యపోతారు. కొత్త కాన్సెప్ట్ సినిమా ఇది. ఇంటర్వెల్ ఆశ్చర్యపరుస్తుంది. ఈ చిత్రం విజయవంతం అయ్యాక మరికొందరు పెద్ద హీరోలు ఈ తరహా చిత్రాల్లో నటించేందుకు ముందుకొస్తారు. ఇది థ్రిల్లర్ జానర్ సినిమా కాబట్టి ముందుగా ఏ విషయాన్నీ బయటకు రానివ్వడం లేదు. దర్శకుడు సుధీర్ వర్మ పనితనం ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం మా సంస్థలో ‘ప్రేమ విమానం’, కళ్యాణ్ రామ్‌తో ‘డెవిల్’ చిత్రాలు నిర్మిస్తున్నాం. ‘డెవిల్’కు సీక్వెల్ కూడా ఉంటుంది.’ అన్నారు.