Aishwarya Rai : అభిషేక్ బచ్చన్ (Abhishek Bachchan) – ఐశ్వర్యారాయ్ (Aishwarya Rai) విడాకులు తీసుకోబోతున్నారని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారంపై ఎప్పుడూ నేరుగా స్పందించకపోయినా పలు వేడుకలకు కలిసి హాజరవుతూ పరోక్షంగా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది బచ్చన్ ఫ్యామిలీ. అయినా వదంతులు వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో వెడ్డింగ్ రింగ్ ధరించి వాటికి మరో చెక్ పెట్టారు ఐశ్వర్యారాయ్.
అట్టహాసంగా జరుగుతున్న ‘పారిస్ ఫ్యాషన్ వీక్’ కు కుమార్తె ఆరాధ్యతో కలిసి ఆమె హాజరయ్యారు. ఈ ఈవెంట్లో పాల్గొనే ముందు ఐశ్వర్యారాయ్ కెమెరాకు పోజులిచ్చారు. సంబంధిత వీడియో బయటకు వచ్చింది. వివాహ సమయంలో అభిషేక్ బచ్చన్ ఇచ్చిన ఉంగరాన్ని ధరించి ఐశ్వర్య ఫ్యాషన్ వీక్‌కు హాజరయ్యారంటూ బాలీవుడ్ మీడియా పేర్కొన్నది. దాంతో విడాకుల రూమర్స్‌కు ఆమె చెక్ పెట్టినట్టయ్యింది.
అమితాబ్ బచ్చన్ ఎక్స్‌లో గత ఏడాది ‘అంతా అయిపోయింది’ అని అర్థం వచ్చేలా ఒక పోస్ట్ పెట్టారు. దాన్ని కొందరు తన కుమారుడు, కోడలు దాంపత్య జీవితానికి ఆపాదించారు. మరోవైపు ఐశ్వర్యారాయ్ సోషల్ మీడియా ఖాతాను అమితాబ్ అన్ ఫాలో చేశారంటూ బాలీవుడ్ మీడియాలో వార్తలు వచ్చాయి. దాంతో విడాకుల వదంతులు మొదలయ్యాయి. కొంతకాలంపాటు ఆ పుకార్లు షికార్లు చేశాయి. ముంబైలోని అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ వార్షిక వేడుకలో అమితాబ్, అభిషేక్, ఐశ్వర్య సందడి చేయడంతో వాటికి తెరపడింది.