Abhinav | ఆదిత్య, విక్కీస్ డ్రీమ్, డాక్టర్ గౌతమ్ వంటి సందేశాత్మక బాలల చిత్రాలను రూపొందించి ఎన్నో పురస్కారాలను సొంతం చేసుకున్నారు దర్శకనిర్మాత భీమగాని సుధాకర్ గౌడ్. ఆయన తెరకెక్కించిన మరో బాలల చిత్రం ‘అభినవ్’. శ్రీలక్ష్మి ఎడ్యుకేషనల్ ఛారిటబుల్ ట్రస్ట్ సమర్పణలో సంతోష్ ఫిలిమ్స్ పతాకంపై ఆయన ఈ చిత్రాన్ని నిర్మించారు. సమ్మెటగాంధీ, సత్య ఎర్ర, మాస్టర్ గగన్, గీతా గోవింద్ ప్రధాన పాత్రల్లో నటించారు.
ఇటీవల నిర్వహించిన ప్రెస్మీట్లో దర్శకనిర్మాత భీమగాని సుధాకర్ గౌడ్ మాట్లాడుతూ ‘పిల్లల్లో చిన్నతనం నుంచే దేశభక్తిని పెంపొందించాలనే లక్ష్యంతో ఈ సినిమా తీశా. కొంతమంది పిల్లలు సరైన మార్గదర్శనం కొరవడటంతో గంజాయి, డ్రగ్స్ వంటి వ్యసనాలకు అలవాటు పడుతున్నారు. ఎస్సీసీ, స్కౌట్స్, యోగా, ధ్యానం వంటి యాక్టివిటీస్ ద్వారా పిల్లలు వ్యసనాలకు దూరంగా ఉండటమే కాకుండా దేశ రక్షణలో భాగం కాగలుతారు. ఈ అంశాన్ని చర్చిస్తూ స్ఫూర్తివంతమైన కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించాం’ అన్నారు.