అమీర్‌ఖాన్ నటించిన ‘దంగల్’ చిత్రం అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ సినిమా చిత్రంగా రికార్డు సృష్టించింది. తాజా ఇంటర్వ్యూలో ఈ సినిమా తాలూకు ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు అమీర్‌ఖాన్. ఈ సినిమా విషయంలో సల్మాన్‌ఖాన్, షారుఖ్‌ఖాన్‌లను అపార్థం చేసుకున్నానని తెలిపారు. ‘నేను సినిమాల విషయంలో బాక్సాఫీస్ కలెక్షన్స్‌ను పరిగణనలోకి తీసుకొని, ట్రెండ్‌కు అనుగుణంగా నా మనసుకు నచ్చిన కథల్ని ఎంచుకుంటాను.
‘లగాన్’ ‘దంగల్’ లాంటి సినిమాలను అలానే ఎంపిక చేసుకున్నా. అయితే ‘దంగల్’ స్క్రిప్ట్ నా దగ్గరకు వచ్చినప్పుడు షారుఖ్, సల్మాన్‌లు నా కెరీర్‌ను దెబ్బతీసేందుకు ఇలాంటి స్క్రిప్ట్‌ను పంపించారేమో అని అనుమానపడ్డాను. అందుకే స్క్రిప్ట్ ఓకే చేయడానికి చాలా టైం తీసుకున్నా. దర్శకుడు నితీష్ తివారీ మాత్రం నాతోనే సినిమా చేస్తానని పట్టుబట్టారు. ఆ తర్వాత ‘దంగల్’ స్క్రిప్ట్‌ను క్షుణ్ణంగా పరిశీలించా. అప్పుడు గొప్ప సబ్జెక్ట్ అని అర్థమైంది.
ఈ సినిమాలో తొలుత తండ్రి పాత్రలో నటించేందుకు సందేహించాను. ఆయినా సరే రిస్క్ తీసుకొని సినిమా చేశా. అప్పటి నుంచి ప్రయోగాలు చేస్తూనే ఉన్నా’ అని చెప్పుకొచ్చారు అమీర్‌ఖాన్. కుస్తీ క్రీడాకారుడు మహావీర్ ఫోగట్, అతడి కుమార్తె జీవితం ఆధారంగా ‘దంగల్’ సినిమాను రూపొందించారు. ఇప్పటి వరకు భారతీయ సినిమాలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ‘దంగల్’ రికార్డుల్లో నిలిచింది.