Aamir Khan – Mahabharat | బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ‘మహాభారత్’ గురించి తాజాగా మాట్లాడారు. మహాభారత్ తనకు శ్రీకృష్ణుడి పాత్రలో నటించాలని ఉందని మనసులోని మాటను చెప్పుకోచ్చాడు. ఈ ఇతిహాసాన్ని భిన్నమైన రీతిలో, భారీ స్థాయిలో తెరకెక్కించాలని ఆమిర్ ఎప్పటినుంచో కలలు కంటున్న విషయం తెలిసిందే.
తాజాగా జరిగిన ఇండియా@2047 సమ్మిట్‌లో అమీర్ ఖాన్ మాట్లాడుతూ.. మహాభారత్ డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి స్పందించాడు. ‘మహాభారత్’ తన జీవితకాలపు స్వప్నమని, అయితే అది చాలా కష్టమైన ప్రాజెక్ట్ అని అన్నారు. “మహాభారత్ మిమ్మల్ని ఎప్పటికీ నిరాశపరచదు, కానీ మీరు మహాభారత్‌ను నిరాశపరచవచ్చు” అని ఆయన వ్యాఖ్యానించారు.
ఈ సినిమాలో తాను ఏ పాత్ర పోషించాలని అనుకుంటున్నారని అడిగిన ప్రశ్నకు అమీర్ ఖాన్ సమాధానమిస్తూ, “నిజానికి, కృష్ణుడు పాత్ర నన్ను బాగా ఆకర్షిస్తుంది. ఆయనంటే నాకు చాలా స్ఫూర్తి. కాబట్టి ఆ పాత్రను పోషించాలని ఉంది” అని అన్నారు. ‘మహాభారత్’ను ఒక భారీ ఫ్రాంచైజీగా రూపొందించాలని, అన్ని భాగాలు ఒకేసారి చిత్రీకరించబడతాయని, వివిధ దర్శకులు ఒక్కో భాగానికి దర్శకత్వం వహిస్తారని ఇదివరకే అమీర్ ఖాన్ తెలిపారు. మొదట్లో నిర్మాతగా మాత్రమే ఉండాలని భావించిన ఆయన, ఇప్పుడు కృష్ణుడి పాత్రపై తనకున్న అభిమానాన్ని వ్యక్తం చేశారు.
ప్రస్తుతం అమీర్ ఖాన్ తన తదుపరి చిత్రం ‘సితారే జమీన్ పర్’ విడుదల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రం జూన్ 20, 2025న విడుదల కానుంది. ఆ తర్వాత ఆయన ‘మహాభారత్’ ప్రాజెక్ట్‌పై దృష్టి సారించే అవకాశం ఉంది. కృష్ణుడి పాత్రలో అమీర్ ఖాన్‌ను చూడటానికి అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.