Aamir Khan | బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ నటించిన చిత్రాలలో ‘లాల్ సింగ్ చడ్డా ఒకటి. మిస్టర్ ఫర్ఫెక్ట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి ఈ సినిమాను తెరకెక్కించాడు. అయితే ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. దాదాపు రూ.180 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం సుమారు ₹130 కోట్ల వసూళ్లు మాత్రమే రాబట్టింది. అయితే ఈ సినిమా పరజయం పొందిన తర్వాత ఆమిర్ ఖాన్ మళ్లీ తెరపై కనిపించలేదు. ప్రస్తుతం సితారే జమీన్ పర్ అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇదిలావుంటే తాను లాల్ సింగ్ చడ్డా సినిమాకు ఎలాంటి పారితోషికం తీసుకోలేదని తెలిపాడు ఆమిర్ ఖాన్. ఆ సినిమా లాభాలు ఆర్జించలేదని అందుకే తాను పారితోషికం తీసుకోలేదని సినిమా వైఫల్యానికి తానే పూర్తి బాధ్యత వహిస్తానని ఆయన స్పష్టం చేశారు.
నా పారితోషికం సినిమా లాభాల నుంచి వస్తుంది. ఒకవేళ సినిమా లాభాలు పొందకపోతే, నాకు డబ్బులు రావు. ఉదాహరణకు, లాల్ సింగ్ చడ్డా ఫ్లాప్ అయ్యింది. నాకు డబ్బులు రాలేదు. దాని గురించి నేను చింతించను. ఇది చాలా సరైన నియమం. నా సినిమా విఫలమైతే, నేను బాధ్యత తీసుకోవాలి కదా అంటూ ఆమిర్ చెప్పుకోచ్చాడు. అయితే, సినిమా ఫ్లాప్ అయితే నటీనటులకు వారి వేతనం నిరాకరించడానికి దీనిని ఉదాహరణగా చూపకూడదని ఆమిర్ పేర్కొన్నారు.
కాగా, ‘లాల్ సింగ్ చడ్డా’ 2022 ఆగస్టు 11న విడుదలైంది. అద్వైత్ చందన్ దర్శకత్వం వహించిన ఈ హిందీ కామెడీ-డ్రామా చిత్రం 1994లో వచ్చిన అమెరికన్ క్లాసిక్ ‘ఫారెస్ట్ గంప్’ యొక్క అధికారిక రీమేక్. ఈ సినిమాలో ఆమిర్ ఖాన్ సరసన కరీనా కపూర్ ఖాన్, నాగ చైతన్య, మోనా సింగ్ మరియు మానవ్ విజ్ ముఖ్య పాత్రల్లో నటించారు.