ఓటీటీ వల్ల థియేటర్ల వ్యవస్థ ప్రమాదంలో పడుతున్నదని, ప్రేక్షకులు సినిమాకు దూరమైపోతున్నారని అమీర్‌ఖాన్ గత కొంతకాలంగా అసంతృప్తిని వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. అందుకే తన తాజా చిత్రం ‘సితారే జమీన్ పర్’ను ఓటీటీలో విడుదల చేసే ప్రసక్తే లేదని, థియేట్రికల్ రిలీజ్ అనంతరం యూట్యూబ్‌లో పే పర్ వ్యూ విధానంలో అందుబాటులో ఉంచుతానని ప్రకటించాడు. అమీర్ తీసుకున్న ఈ నిర్ణయం సంచలనంగా మారింది. ఓటీటీ సంస్థల్లో కూడా ఆందోళన వ్యక్తమవుతున్నది.
ఈ నేపథ్యంలో ‘సితారే జమీన్ పర్’ సినిమా విషయంలో అమీర్‌ఖాన్ దాదాపు 120 కోట్ల భారీ ఆఫర్‌ను తిరస్కరించారని తెలిసింది. ఈ సినిమా ఓటీటీ హక్కుల కోసం అమెజాన్ ప్రైమ్ ఆసక్తిని కనబరచిందట. అందుకోసం 120 కోట్ల భారీ డీల్‌ను ఆఫర్ చేసిందట. అయితే అమీర్‌ఖాన్ ఆ ఆఫర్‌ను తిరస్కరించారని, ఓటీటీల విషయంలో తన నిర్ణయంలో మార్పు ఉండదని చెప్పారని తెలిసింది. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కించిన ‘సితారే జమీన్ పర్’ ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకురానుంది. అమీర్‌ఖాన్, జెనీలియా డిసౌజా కీలక పాత్రల్లో నటించారు.