Laal Singh Chaddha Telugu Trailer | అమీర్‌ఖాన్ పేరు తెలియని సినీ ప్రేక్షకుడు ఉండడేమో. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా ఇలా పలు విభాగాల్లో పనిచేస్తూ బాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. సందేశాత్మక సినిమాలను చేయడంలో ఈయన ఎప్పుడు ముందు వరుసలో ఉంటాడు. ప్రస్తుతం ఈయన నటించిన ‘లాల్ సింగ్ చడ్డా’ కూడా ఈ జానర్‌కు చెందిందే. అద్వైత్ చందన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య కీలకపాత్రలో నటించాడు. ఇప్పటికే చిత్రం నుండి విడులైన ప్రచార చిత్రాలు, ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేశాయి. ఇక ఈ చిత్రాన్ని తెలుగులో చిరంజీవి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు. తాజాగా ఈ చిత్ర తెలుగు ట్రైలర్‌ను చిరు విడుదల చేశాడు.
‘జరుగుతున్నవన్ని మనం చేస్తున్నామా.. లేదా మనం గాలిలా ఊరికే ఎగురుతూ పోతున్నామా’ అంటూ ట్రైలర్ ప్రారంభమవుతుంది. ‘చెప్తే నమ్మరు గాని జీవితంలో అద్భుతాలు జరుగుతాయిండి’. ‘అమ్మ చెప్తూ ఉండేది.. మనందరి తలరాత ముందే రాసుంటుందని, అలా రాసినట్టే జరుతుందని’. ‘నాకు తెలియనిది ఏమిటంటే ఎవరు రాశారో, ఎంత రాశారో, అసలు ఎందురు రాశారో ఇవన్ని’ అంటూ అమీర్ పలికే సంభాషణలు ఆకట్టుకుంటున్నాయి. ట్రైలర్ చివర్లో ‘మా అమ్మ ఎప్పుడూ చెప్తుండేది లైఫ్ అంటే పానిపూరి లాంటిందని.. కడుపు నిండినట్లుంది కానీ మనసు మాత్రం నిండదని’ అనే డైలాగ్ నవ్విస్తూనే ఆలచింపజేసేలా ఉంది. ఇక ఈ ట్రైలర్ అమీర్ జర్నీ సినిమాలో ఎలా ఉండబోతుంది అని చెప్తుంది. నడవలేని స్థాయి నుండి రన్నర్‌గా మెడల్స్ గెలిచే స్థాయికి ఎలా అమీర్ ఖాన్ ఎదిగాడు అనే విధంగా సినిమా ఉండనున్నట్లు తెలుస్తుంది.
ఈ చిత్రం హాలీవుడ్ ‘ఫారెస్ట్ గంప్’ సినిమాను బేస్ చేసుకుని తెరకెక్కించారు. అమీర్‌కు జోడీగా కరినా కపూర్ హీరోయిన్గా నటించింది. వయాకమ్18 స్టూడీయోస్‌తో కలిసి అమీర్‌ఖాన్ స్వీయ నిర్మాణంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. గతంలోనే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పలు కారణాల వల్ల విడుదల తేదీ వాయిదా పడుతూ వచ్చింది. కాగా ఈ చిత్రం ఆగస్టు 11న హిందీతో పాటు తెలుగులోనూ ఏకకాలంలో విడుదల కానుంది.