సినిమా అంటే మనలో చాలామందికి ఎంటర్టైన్మెంట్! కానీ, మిస్టర్ పర్ఫెక్షనిస్ట్గా పేరున్న ఆమిర్‌ఖాన్‌కు మాత్రం సినిమా అంటే.. ఓ మాధ్యమం.. ఆలోచనలను, భావాలను ప్రపంచంతో పంచుకునే మార్గం!! జీవితాల్ని ఆవిష్కరించే వేదిక.. ప్రేక్షకుల హృదయాల్ని తాకే సాధనం!! సొసైటీలోని చీకటి కోణాల్ని సున్నితంగా చూపించే 70 ఎంఎం వెండితెర నాటకం సినిమా! … అందుకే ఆయన ‘లగాన్’ తీస్తే ‘కమాన్’ అంటూ బ్రిటిష్ సామ్రాజ్యవాదపు ‘ఆట’ కట్టించాం! ‘రంగ్ దే బసంతి’ అంటే నేటితరం చూపే తెగువకు సలాం చేశాం! ‘3 ఇడియట్స్’తో విద్యా వ్యవస్థను ప్రశ్నిస్తే తిరుగులేని హిట్ ఇచ్చాం! ఇలా చెబుతూ వెళ్తే ‘పీకే’, ‘దంగల్’, ‘సీక్రెట్ సూపర్ స్టార్’, ‘తారే జమీన్ పర్’.. ఇప్పుడు ‘సితారే జమీన్ పర్’!! అన్నీ మన కథలే!! మన చుట్టూ చూసిన వ్యథలే!! అందుకే ఆయన్ని ప్రేక్షకుడి మనసు తెలిసిన సినిమా సైంటిస్ట్ అనొచ్చేమో!!
భారతీయ సినిమా పరిశ్రమలో ఒక బ్రాండ్‌గా నిలిచిన పేరు ఆమిర్‌ఖాన్. ‘మిస్టర్ పర్ఫెక్షనిస్ట్’ అనే ట్యాగ్‌తో సినీ అభిమానుల మదిలో చెరగని ముద్రవేశాడు. కేవలం నటుడే కాదు.. నిర్మాత, దర్శకుడు కూడా. సమాజంలోని భిన్నమైన అంశాలను, సున్నితమైన విషయాలను తన సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాడు. ఆమిర్ సినిమా అంటే కేవలం వినోదం కోసం సినిమాలు తీయడు.. అందులో ఆలోచింపజేసే సందేశం ఉంటుంది. సమాజంలో మార్పు తీసుకొచ్చే శక్తి ఉంటుందని ప్రేక్షకులు విశ్వసిస్తారు. గతంలో ‘తారే జమీన్ పర్’ సినిమాతో విద్యావ్యవస్థలోని లోపాల్ని ఎత్తి చూపాడు.. పిల్లల పఠన సామర్థ్యాల్ని ఎలా గుర్తిస్తున్నారని సూటిగా ప్రశ్నించాడు. ఇప్పుడు ‘సితారే జమీన్ పర్’ సినిమాతో మరోసారి సమాజంలోని భిన్న కోణాల్ని ఆవిష్కరించాడు. మానసిక వైకల్యంపై దృష్టి సారించి మరో మార్పునకు శ్రీకారం చుట్టాడు.
2007లో విడుదలైన ‘తారే జమీన్ పర్’ సినిమా ఆమిర్ ఖాన్ కెరీర్లో ఓ మైలురాయి. ఆయనే ఈ సినిమా నిర్మాత, దర్శకుడు. సినిమా కేవలం ఒక కథ కాదు. మన విద్యావ్యవస్థపై ఓ ఉద్యమం అనొచ్చు. డిస్లెక్సియా అనే లెర్నింగ్ డిజార్డర్‌తో బాధపడే పిల్లవాడి కథతో సమాజంలోని విద్యావ్యవస్థ లోపాలను ఎత్తి చూపాడు ఆమిర్. ప్రతి పిల్లవాడు ప్రత్యేకం అనే విషయాన్ని బలంగా చెప్పాడు. పిల్లల సామర్థ్యాలను గుర్తించడంలో తల్లిదండ్రులు, టీచర్లు ఎలా విఫలమవుతున్నారో ఇందులో చూపించాడు. ఈ సినిమా ప్రతి ఒక్కరి హృదయాన్ని తాకింది. ఈశాన్లా ఎందరో పిల్లలు సమాజంలో తమ స్థానం కోసం పోరాడుతున్నారని.. వారికి అవసరమైనది ఒక సరైన మార్గదర్శనమని ఈ సినిమా చెప్పింది. ఆమిర్ ఈ సినిమాలో టీచర్‌గా నటించి, పిల్లల్లోని సృజనాత్మకతను ఎలా వెలికితీయాలో చూపించాడు.
గత కొంతకాలంగా సరైన సక్సెస్ లేక తపిస్తున్న ఆమిర్‌కి ‘సితారే జమీన్ పర్’ ఆ వెలితిని పూడ్చింది. దాదాపు 90 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా రెండు వారాల్లో రూ.140 కోట్లకు పైగా వసూలు చేసింది. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. మానసిక సవాళ్లు ఎదుర్కొనే ఆటగాళ్లకు శిక్షణ ఇచ్చి తీర్చిదిద్దే కథ ఇది. జెనీలియా కీలకపాత్రలో కనిపించింది. ఈ క్రమంలో కోచ్‌గా ఆమిర్ ఎదుర్కొనే సవాళ్లు, అతని ప్రయాణం ఆకట్టుకుంటాయి. పేరులో ‘తారే జమీన్ పర్’ తొంగిచూసినా.. దీని ప్రత్యేకత దీనిదే. ఈ సినిమాలో ఆమిర్ బాస్కెట్‌బాల్ కోచ్‌గా నటించాడు. మానసిక వైకల్యం ఉన్న క్రీడాకారులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి, వారి జీవితాల్లో కొత్త ఆశలు చిగురింపజేశాడు.
ఈ చిత్రం హాస్యభరితంగా సాగుతూనే.. లోతైన విషయాల్ని ప్రేక్షకుల ముందు ఉంచుతుంది. “సితారే జమీన్ పర్’ నా కమ్‌బ్యాక్ చిత్రం అని అంటున్నారు. కానీ, నేను మూడేళ్లకు ఒక సినిమా చేస్తాను. ఈ క్రమంలో పరాజయాలు నన్ను ఒత్తిడిలోకి నెట్టినా.. మళ్లీ ఓ మంచి సినిమాతో ముందుకు రావాలనే చూస్తాను. ఈ సినిమా అలా నిలుస్తుందని అనుకుంటున్నాను..’ అని ఈ చిత్రం విడుదలకు ముందు ఆమిర్ తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. అన్నట్టుగానే, వసూళ్లపరంగా సూపర్బ్ అనిపించుకున్న ఈ చిత్రం, నటనపరంగా ఆమిర్‌ను మరో మెట్టు పైకి ఎక్కించిందనే చెప్పాలి.
ఆమిర్‌ఖాన్ కల ‘మహాభారతం’. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ పని ప్రారంభించాలని ఆలోచిస్తున్నట్టు ఇటీవల ఇంటర్వ్యూలలో చెప్పాడు. ఇందులో ఆయన శ్రీకృష్ణుడి పాత్ర పోషించడంపై ఆసక్తి కనబరుస్తున్నాడు. ‘మహాభారతం నా కలల ప్రాజెక్టు. ఇది నన్ను చాలా ఎమోషనల్‌గా కదలించిన కథ. ముఖ్యంగా శ్రీకృష్ణుడి పాత్ర నన్ను చాలా ఆకర్షించింది. ఆ పాత్రలో నటించాలని నా కోరిక. అయితే, ఈ ప్రాజెక్టు ఆమిర్ చివరి సినిమా కాదు. నాకు ఇంకా చాలా కథలు చెప్పాలని ఉంది. అలాగే 1994లో వచ్చిన ‘అందాజ్ అప్నా అప్నా’ సినిమాకి సీక్వెల్ గురించి కూడా ఆలోచిస్తున్నా’నంటూ చెప్పుకొచ్చాడు. ఈ మిస్టర్ పెర్ఫక్షనిస్ట్ నుంచి మరిన్ని మంచి సినిమాలు రావాలని ఆశిద్దాం!!
ఆమిర్ ఖాన్ నటించిన ‘సితారే జమీన్ పర్’ సినిమా సమాజంలో మార్పు తీసుకొచ్చే గొప్ప సందేశాత్మక చిత్రమని రాజ్యసభ ఎంపీ సుధామూర్తి ప్రశంసించారు. ఈ సినిమా మానసిక సవాళ్లు ఎదుర్కొనే పిల్లల మనస్తత్వాన్ని అర్థం చేసుకోవడం, వారికి మద్దతు ఇవ్వడం ఎలాగో సున్నితంగా చూపిస్తుంది. వారి స్వచ్ఛమైన మనసు, నవ్వులు, ఎదుటివారి సంతోషంలో పాలుపంచుకునే గుణం నుంచి మనం చాలా నేర్చుకోవచ్చని సుధామూర్తి అన్నారు.