తమిళ అగ్ర దర్శకుడు లోకేష్ కనకరాజ్‌తో సినిమా చేయబోతున్నట్లు బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్‌ఖాన్ తెలిపారు. సూపర్‌హీరో కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతుందని, భారీ యాక్షన్ ఉంటుందని పేర్కొన్నారు. షారుఖ్‌ఖాన్‌తో అట్లీ తీసిన ‘జవాన్’ భారతీయ సినిమా బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టిన విషయం తెలిసిందే. దీంతో బాలీవుడ్ అగ్ర హీరోలు దక్షిణాది దర్శకులపై ప్రత్యేకంగా దృష్టిపెడుతున్నారు.
లోకేష్ కనకరాజ్‌తో అమీర్‌ఖాన్ సినిమా చేయనున్నారని గతంలోనే వార్తలొచ్చాయి. తాజాగా అమీర్‌ఖాన్ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. తన తాజా చిత్రం ‘సితారే జమీన్ పర్’ ప్రమోషన్స్ సందర్భంగా ఆయన ఈ ప్రకటన చేశారు. వచ్చే ఏడాది జూన్‌లో లోకేష్ కనకరాజ్‌తో చేయబోయే సినిమా పట్టాలెక్కుతుందని, ప్రస్తుతానికి అంతకుమించిన వివరాలను పంచుకోలేనని అమీర్‌ఖాన్ అన్నారు.
అమీర్-లోకేష్ కనకరాజ్ కాంబో ఖరారు కావడంతో మరో పాన్ ఇండియా యాక్షన్ మూవీ సిద్ధంకానుందని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమిళంలో ఖైదీ, విక్రమ్, లియో వంటి సినిమాలతో తనదైన మార్క్‌ను క్రియేట్ చేసుకున్నారు లోకేష్ కనకరాజ్. ప్రస్తుతం ఆయన రజనీకాంత్‌తో ‘కూలీ’ చిత్రాన్ని చేస్తున్నారు.