Aadi Sai Kumar Shambhala | టాలీవుడ్ యువ కథానాయకుడు ఆది సాయికుమార్ నటిస్తున్న తాజా చిత్రం ‘శంబాల.. ఏ మిస్టిక్ వరల్డ్’. యుగంధర్ ముని దర్శకత్వం వహిస్తున్న ఈ సూపర్ నాచురల్ హారర్ థ్రిల్లర్‌లో అర్చన అయ్యర్, స్వాసిక్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. రాజశేఖర్ అన్నభీమోజు, మహీధర్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా మూవీ నుంచి ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్.
కొన్ని వేల సంవత్సరాల క్రితం పరమశివుడికి, అసురుడికి మధ్య జరిగిన ఒక భీకరయుద్ధం ఈ కథకి ములం అంటూ సాయికుమార్ వాయిస్ ఓవర్‌తో ట్రైలర్ మొదలయ్యింది. అనంతరం ఆకాశం నుంచి ఒక ఉల్క లాంటి రాయి కిందికి వచ్చి ఒక ఊరిలో పడుతుంది. అయితే అది పడిన తర్వాత నుంచి ఆ ఊరిలో ప్రజలు వింతగా ప్రవర్తిస్తుంటారు. అయితే దాని వెనుక ఉన్న రహస్యం ఏంటి.. ఆ రహస్యాన్ని కనుగొని ప్రజలను హీరో ఎలా కాపాడాడు అనేది ఈ సినిమా కథ. ఆది సాయికుమార్ ఈ చిత్రంలో భౌగోళిక శాస్త్రవేత్తగా ఓ ఛాలెంజింగ్ పాత్రలో కనిపించనున్నారు.