Prabhas | స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం భారీ పాన్ ఇండియా మూవీస్ లైనప్ చేసుకోవడమే కాదు వరుస రిలీజ్‌లకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ‘ఆది పురుష్’ జూన్ 16న, ‘సలార్’ సెప్టెంబర్ 28న, ‘ప్రాజెక్ట్ కె’ జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఈ క్రమంలో ఆయన ఎంచుకున్న చిత్రాల్లో ఒక సినిమా మాత్రం భిన్నంగా, ఆశ్చర్యపరిచేలా ఉందని సినీ ప్రియులు అభిప్రాయపడుతున్నారు. అదే మారుతి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న సినిమా. రొమాంటిక్ హారర్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రాల్లో చిన్న బడ్జెట్ మూవీ అని అంతా భావిస్తున్నారు కానీ ఈ సినిమా కూడా భారీ ప్రాజెక్ట్‌గానే రూపుదిద్దుకుంటున్నదట.
ఈ చిత్రంలో వీఎఫ్ఎక్స్ కోసమే కోట్లాది రూపాయల వ్యయం చేస్తున్నారనేది తాజా సమాచారం. హారర్ సన్నివేశాల రూపకల్పన ఆకట్టుకునేలా ఉండేందుకు ఇంత ఖర్చు చేస్తున్నారట. ఈ చిత్రంలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, ఆషికా రంగనాథ్ నాయికలుగా నటిస్తున్నట్లు తెలుస్తున్నది. వరుసగా యాక్షన్ చిత్రాల్లో నటిస్తున్న తనకు ఇదొక వైవిధ్యమైన చిత్రమవుతుందని గతంలో ప్రభాస్ చెప్పుకున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం రెగ్యులర్ చిత్రీకరణ జరుపుకుంటున్నది.