Pawan Kalyan | ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా రాజకీయ బాధ్యతలు నిర్వర్తిస్తున్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మరోవైపు తన సినిమాల పనుల్లోనూ జోరుగా ముందుకెళ్తున్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న భారీ యాక్షన్ డ్రామా ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) పై అభిమానుల్లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాకు సంబంధించి ఇటీవల విడుదలైన రెండో పాట పోస్టర్ ఇప్పుడు ఆసక్తికరమైన చర్చకు దారితీసింది.దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో పవన్ కల్యాణ్‌కు జోడీగా ప్రియాంక మోహన్ నటిస్తున్నారు. తాజాగా విడుదలైన పోస్టర్లో, దీపాల వెలుతురు మధ్య రొమాంటిక్ మూడ్‌లో కనిపించిన ఈ జంట ప్రేక్షకుల మన్ననలు అందుకుంది. అయితే ఈ పోస్టర్లో అందరి దృష్టిని ఆకర్షించిన అంశం మాత్రం పవన్ కల్యాణ్ చేతిపై కనిపించిన జపనీస్ టాటూ.
సోషల్ మీడియాలో ఈ టాటూ పెద్ద చర్చనీయాంశంగా మారింది. అభిమానులు దాని అర్థం గూగుల్‌లో వెతుకుతూ అన్వేషణ మొదలుపెట్టారు. అందులో భాగంగా ఆ మూడు జపనీస్ అక్షరాలు వీటిని సూచిస్తున్నాయనే ప్రచారం జరుగుతోంది: మొదటి అక్షరం – వాగ్దానం (Promise), రెండో అక్షరం – బలం (Strength), మూడో అక్షరం – నిప్పు (Fire). ఈ మూడు పదాలు కలిపి పవన్ కల్యాణ్ ‘ఓజీ’లో పోషిస్తున్న పాత్ర యొక్క లోతు, లక్ష్యం, మరియు ఉత్సాహాన్ని ప్రతిబింబిస్తున్నాయని అభిమానులు భావిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, మొదటి పాట సినిమాపై భారీ హైప్‌ను సృష్టించగా, ఈ టాటూ మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ఇటీవల విడుదలైన OG చిత్రం మొదటి పాట Fire Storm ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. OG థీమ్ సాంగ్ గా సాగిన పాట లిరిక్స్, థమన్ అందించిన క్యాచీ ట్యూన్ మ్యూజిక్ లవర్స్ ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇక ప్రస్తుతం మేకర్స్ 2వ పాటను విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ క్రమంలో పాట వినాయక చవితి సందర్భంగా విడుదల కానుంది. ఈ చిత్రంలో విలన్ గా ఇమ్రాన్ హష్మీ నటిస్తున్నారు. సీనియర్ నటి శ్రియా రెడ్డి కీలక పాత్ర పోషిస్తోంది. డీవీవీ దానయ్య నిర్మించిన ఈ చిత్రాన్ని థమన్ ఎస్ సంగీతం అందిస్తుండటం విశేషం. ఇక సెప్టెంబర్ 25, 2025న వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ ను పూర్తి చేసుకుంటున్నారు.