A. Sreekar Prasad | భారతీయ సినీ పరిశ్రమకు మరో అరుదైన గౌరవం దక్కింది. ప్రముఖ ఎడిటర్ ఏ శ్రీకర్ ప్రసాద్‌కు ప్రపంచ ప్రఖ్యాత అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ (ఆస్కార్ అకాడమీ) నుంచి అధికారిక ఆహ్వానం అందింది. ఈ ఆహ్వానం ద్వారా ఆయన అకాడమీ సభ్యుడిగా చేరే అవకాశం లభించడంతో భారతీయ సినీ వర్గాల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఈ గౌరవంతో ఆయన రానున్న రోజులలో ఆస్కార్ నామినేషన్స్, విజేతలని నిర్ణయించే ఓటింగ్ హక్కుని కూడా పొందారు. శ్రీకర్ ప్రసాద్‌కి 40 ఏళ్లకి పైగా సినీ ప్రస్థానం ఉంది. దశాబ్దాలుగా భారతీయ సినీ పరిశ్రమలో అత్యుత్తమ ఎడిటర్‌గా గుర్తింపు పొందిన ఏ శ్రీకర్ ప్రసాద్ అనేక భాషల్లో పనిచేస్తూ తన ప్రత్యేక ముద్ర వేశారు. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ చిత్రాలతో పాటు అంతర్జాతీయ స్థాయిలోనూ ఆయన ప్రతిభను చాటుకున్నారు.
ఇప్పుడు ఆస్కార్ అకాడమీ నుంచి ఆహ్వానం రావడం ఆయన వ్యక్తిగత విజయమే కాకుండా భారతీయ సాంకేతిక నిపుణులకు దక్కిన అరుదైన గౌరవంగా సినీ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు.17 భాషలలో 650కి పైగా సినిమాలకి ఎడిరటర్గా పని చేసిన శ్రీకర్ ప్రసాద్ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో కూడా చోటు సంపాదించుకున్నారు. దిల్ చాహతా హై, కన్నత్తిల్ ముత్తమిట్టాల్, ఒక్కడు, గురు, కామినే, తుపాకి, కత్తి, తల్వార్, సైరా నరసింహారెడ్డి, ఆర్ఆర్ఆర్, పొన్నియన్ సెల్వన్, ది గోట్ లైఫ్ వంటి ఎన్నో గొప్ప చిత్రాలకి ఆయన ఎడిటర్‌గా పని చేశారు. శ్రీకర్ ప్రతిభకి గాను 9 నేషనల్ అవార్డ్స్ వచ్చాయి.
ఈ 9 జాతీయ అవార్డ్స్‌లో 7 సార్లు ఉత్తమ ఎడిటర్‌గా అవార్డ్ దక్కించుకొని ఈ కేటగిరీలోనే సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశాడు. అయితే ఇప్పుడు ఆస్కార్ అకాడమీ ఆహ్వానం అందుకున్న సందర్భంగా సినీ ప్రముఖులు, దర్శకులు, నటులు, సాంకేతిక నిపుణులు ఏ శ్రీకర్ ప్రసాద్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. భారతీయ సాంకేతిక నిపుణుల ప్రతిభ ప్రపంచ వేదికపై మరోసారి గుర్తింపు పొందిందని పలువురు పేర్కొంటున్నారు. ఇటీవలి సంవత్సరాల్లో భారతీయ సినిమాలకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పెరుగుతోంది. దర్శకులు, సంగీత దర్శకులు, నటులతో పాటు సాంకేతిక నిపుణులు కూడా ప్రపంచ వేదికపై ప్రశంసలు అందుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఏ శ్రీకర్ ప్రసాద్‌కు ఆస్కార్ అకాడమీ నుంచి ఆహ్వానం రావడం భారతీయ సినిమాకు మరో గర్వకారణంగా నిలిచింది. ఆయన అనుభవం, ప్రతిభ అంతర్జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు పొందుతుందని సినీ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.