పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన ప్రభాస్ ‘ప్రాజెక్ట్ కె’ చేయడం గొప్ప విషయంగా భావించనక్కర్లేదుగానీ.. ఎవడే సుబ్రమణ్యం, మహానటి వంటి సెన్సిబుల్ కథలను తెరకెక్కించిన దర్శకుడు నాగ్అశ్విన్ ‘ప్రాజెక్ట్ కె’ చేయడం నిజంగా ఊహించని విషయమే. అతను గతంలో చేసిన కథలకు పూర్తి భిన్నమైన కథ ‘ప్రాజెక్ట్ కె’. ఇది దర్శకునిగా అతనికో ఛాలెంజ్. ఇక ఈ సినిమా విషయానికొస్తే.. ఇది ఎవరూ ఊహించని కాన్సెప్ట్ అని తెలుస్తోంది. ‘ప్రాజెక్ట్ కె’ ఫలానా తరహా కథ అంటూ గతంలో చాలా గాసిప్పులొచ్చినా అవేమీ నిజం కాదని విశ్వసనీయవర్గాల సమాచారం. నిజానికి ‘ప్రాజెక్ట్ కె’ తరహా సినిమా భారతీయ సినీచరిత్రలో రాలేదని తెలుస్తోంది. సగటు ప్రేక్షకుడు ఊహించని కథాకథనాలతో ఈ సినిమా రాబోతున్నది. భారతీయ విజ్ఞానం, మన పురాణ ఇతిహాసాలు, భారతీయ చరిత్ర ఇవన్నీ కథలో మిళితమై ఉంటాయని సమాచారం.
ఓ విధంగా చెప్పాలంటే ఇదొక యూనివర్సల్ కాన్సెప్ట్. తెరపై ఓ కొత్తలోకాన్ని ఆవిష్కరించనున్నాడు నాగ్అశ్విన్. ఇందులోని పాత్రధారుల వేషధారణలు కూడా కొత్తగా ఉంటాయని.. తెరపై వాతావరణం గతంలో ఎన్నడూ చూడని విధంగా ఉంటుందని తెలుస్తున్నది. కథానుసారం అందరి పాత్రలూ గొప్పగానే ఉన్నా.. కమల్‌హాసన్ పాత్ర మాత్రం సినిమాకే హైలైట్‌గా నిలువనుందని తెలిసింది. ఆశ్చర్యంతో కూడిన భావోద్వేగం.. అంచనాలకు మించిన భారీతనం వెరసి ‘ప్రాజెక్ట్ కె’ తెలుగు సినిమా ఖ్యాతిని మరింత పెంచే స్థాయిలో ఉండబోతుందని ఆశించవచ్చు.