అరవింద్ కృష్ణ, జ్యోతి పూర్వజ్, మనీష్ గిలాడ, అషురెడ్డి లీడ్ రోల్స్‌లో నటిస్తున్న సూపర్ హీరో మూవీ ‘ఏ మాస్టర్ పీస్’. పూర్వాజ్ దర్శకుడు. శ్రీకాంత్ కాండ్రేగుల, మనీష్ గిలాడ, ప్రజయ్ కామత్ నిర్మాతలు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. సోమవారం ఈ సినిమా షూటింగ్ కవరేజ్‌కు చిత్రబృందం విలేకరులను ఆహ్వానించింది. దర్శకుడు పూర్వాజ్ మాట్లాడుతూ ‘పురాణ ఇతిహాసాల నుంచి స్ఫూర్తి పొంది తయారు చేసిన కథ ఇది.
దశరథుని మంత్రుల్లో ఒకరైన సుమంత్రుడికి శ్రీరాముడు వనవాసం వెళ్తున్న సమయంలో ఒక వరం లభిస్తుంది. ఆ వరం నేపథ్యంలో సూపర్‌హీరో పాత్రను సృష్టించడం జరిగింది. అలాగే కృతయుగానికి చెందిన హిరణ్యకశ్యపుడి అంశంతో ఓ సూపర్ విలన్ పాత్రను డిజైన్ చేశాం. ఈ పాత్రల్ని ఇప్పటి కలియుగానికి అనుసంధానిస్తూ సాగే వైవిధ్యమైన స్క్రిప్ట్ ఇది. ఇందులో శివుడి నేపథ్యం కూడా ఉంటుంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే మహాశివరాత్రి కానుకగా సినిమాను విడుదల చేస్తాం.’ అని తెలిపారు.