భగవాన్ శ్రీకృష్ణుని దివ్యత్వాన్నీ, ధీరత్వాన్నీ, ఆధ్యాత్మిక ప్రభావాన్నీ తెలియజేస్తూ రూపొందుతున్న పౌరాణిక దృశ్యకావ్యం ‘శ్రీకృష్ణ అవతార్ ఇన్ మహోబా’. 11, 12వ శతాబ్దాల నాటి ‘మహోబా’ సాంస్కృతిక వైభవాన్ని కూడా ఈ కథలో చూపించనున్నారు. ఈ చిత్రానికి రచన, దర్శకత్వం ముకుంద్ పాండే. అభయ్చరణ్ ఫౌండేషన్ అండ్ శ్రీజీ ఎంటైర్టెన్మెంట్స్ కలిసి ఈ మహాకావ్యాన్ని నిర్మిస్తున్నాయి.
ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటనను తాజాగా విడుదల చేశారు. ఇస్కాన్ జితామిత్ర ప్రభుశ్రీ దివ్య ఆశీస్సులతో, ఒక పాన్ వరల్డ్ ప్రాజెక్ట్‌గా ఈ సినిమాను రూపొందించనున్నామని మేకర్స్ తెలియజేశారు. సాంస్కృతిక వారసత్వం, ఆధ్యాత్మికత మేళవింపుగా ఈ సినిమా ఉంటుందని, ఇందులో తొలిసారిగా శ్రీకృష్ణుడ్ని ఒక యుద్ధవీరుడిగా చూపించబోతున్నామని మేకర్స్ తెలిపారు. ఈ సినిమాకు సంబంధించిన నటీనటులు, సాంకేతిక బృంద వివరాలు త్వరలో తెలియరానున్నాయి. ఈ చిత్రానికి నిర్మాణ నిర్వాహణ: అనిల్ వ్యాస్.