హీరో శివాజీ, వాసుకి ఆనంద్ సాయి ప్రధాన పాత్రల్లో ఆదిత్య హాసన్ దర్శకత్వంలో రూపొందిన వెబ్ సిరీస్ ‘90s’. ‘ఎ మిడిల్ క్లాస్ బయోపిక్’ అనేది ఉప శీర్షిక. ఎంఎన్ఓపీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజశేఖర్ మేడారం నిర్మించారు. మౌళి, వాసంతిక, రోహన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈటీవీ విన్ వేదికగా జనవరి 5 నుంచి స్ట్రీమింగ్ అవుతున్న ఈ వెబ్ సిరీస్ సక్సెస్ మీట్‌ను యూనిట్ శుక్రవారం రాత్రి నిర్వహించింది. హీరో శివాజీ మాట్లాడుతూ ‘ఒక్క ఎపిసోడ్ విని ఓకే చేసే కథ ఇది. నేను చేసిన ‘మిస్సమ్మ’ అప్పటికి ఇండియన్ టాప్ 50 సినిమాల్లో ఒకటిగా నిలిచింది.
ఇవాళ ఇండియన్ ఓటీటీలో టాప్ 5గా ఉండటానికి అన్ని అర్హతలూ ‘90s’కు ఉన్నాయి. ఆదిత్య అద్భుతంగా రాశారు. ‘90s’ నా కెరీర్లో గుర్తుండిపోతుంది. దీన్ని సినిమాగా విడుదల చేస్తారని ఆశిస్తున్నాను. అందరూ చక్కగా పనిచేశారు. ప్రతి ఒక్కరికీ పేరుపేరున ధన్యవాదాలు’ అన్నారు. సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ మాట్లాడుతూ.. ‘మన జీవితాన్ని అద్దంలో చూపించిన సిరీస్ ఇది. సంక్రాంతికి థియేటర్సే కాదు.. ఓటీటీలు కూడా హిట్స్ ఇస్తాయనడానికి ‘90s’ నిదర్శనం’ అని కొనియాడారు. ‘200 మిలియన్ వ్యూస్ తెచ్చుకున్న తొలి తెలుగు వెబ్ సిరీస్ ఇదే’ అని సాయికృష్ణ చెప్పారు. ఈ కార్యక్రమంలో యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.