Prabhas | యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుస పెట్టి సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన ఖాతాలో అరడజనుకి పైగా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. మారుతి దర్శకత్వంలో ది రాజా సాబ్ అనే సినిమా చిత్రీకరణ పూర్తి చేసిన ప్రభాస్ ఇప్పుడు హను రాఘవపూడితో ఓ మూవీ చేస్తున్నాడు. ఇది స్వతంత్ర పోరాట కాలం, రెండో ప్రపంచ యుద్దం కాలం నాటి బ్యాక్ డ్రాప్‌తో రాబోతోందని వార్తలు వస్తున్నాయి. పూజా కార్యక్రమాలు జరిగిన సమయంలో ఓ పోస్టర్ విడుదల చేయగా, అందులో ఆజాద్ హింద్ ఫౌజ్ అని కూడా కనిపించింది. ఈ క్రమంలో మూవీకి ఫౌజీ అనే టైటిల్ ఫిక్స్ చేశారనే టాక్ కూడా వచ్చింది. మైత్రీ మూవీస్ బ్యానర్ పై ప్రభాస్ హీరోగా ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.
హైదరాబాద్‌లోని మారుమూల ప్రాంతంలో ఈ మూవీ షూటింగ్ జరుగుతుంది. అయితే సెట్స్‌లోకి అడుగుపెట్టేందుకు అనుపమ్ ఖేర్ చాలా ఇబ్బంది పడ్డారు. ఏకంగా గోడ దూకాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ సంఘటనకు సంబంధించి అనుపమ్ ఖేర్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. ఆ పోస్టులో .. ‘ 40 ఏళ్ల నా సినిమా జీవితంలో ఎన్నో షూటింగ్ లోకేషన్స్లోకి వెళ్లాను. కానీ, ఈ రోజు జరిగింది.. చాలా ప్రత్యేకమైనది, నవ్వు తెప్పించేది కూడా. నేను ప్రభాస్ కొత్త సినిమా కోసం హైదరాబాద్ వచ్చాను. కారులో షూటింగ్ లోకేషన్‌కు బయలుదేరాను. అయితే మా డ్రైవర్ కారును అడవి లాంటి ప్రాంతంలోకి తీసుకువచ్చి ఆపేసాడు.ముందుకు పోవడానికి లేదు, వెనక్కు రావడానికి కూడా లేదు. తర్వాత ఏం జరిగిందో మీరే చూడండి’ అని రాసుకొచ్చారు.
కుచ్ బీ హో సక్తా హై అనే హ్యాష్ ట్యాగ్ కూడా యాడ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. అయితే ప్రభాస్ షూట్ జరిగే ప్రాంతానికి డైరెక్ట్‌గా కారు వెళ్లే మార్గం లేదు. దీంతో చిన్న నిచ్చెన సాయంతో అనుపమ్ ఖేర్ గోడ ఎక్కి ఆ తర్వాత అవతలికి దిగారు. 70 ఏళ్ల వయసులో అనుపమ్ ఖేర్ చేసిన పనిపై నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. అలానే అనుపమ్ ఫిట్నెస్ బాగానే ఉందని అంటున్నారు. బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కార్తికేయ 2 సినిమాతో తెలుగు నాట మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కార్తికేయ 2 సినిమా బ్లాక్ బాస్టర్ కావడంతో అనుపమ్ ఖేర్‌కు తెలుగులో వరుస అవకాశాలు వచ్చాయి.