Re Release Movies | టాలీవుడ్లో జూలై నెల రీ-రిలీజ్‌ల హంగామాతో సినీ ప్రేమికులకు పండగలా మారనుంది. ఒకే నెలలో ఏకంగా ఆరు క్లాసిక్ హిట్ సినిమాలు మళ్లీ థియేటర్లలోకి రావడానికి రెడీ అయ్యాయి. అభిమానులను మళ్లీ వెనకటి రోజుల్లోకి తీసుకెళ్లేందుకు నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు ఇప్పటికే ప్లాన్ రెడీ చేశారు. ఈ లైన్అప్లో యాక్షన్, రొమాన్స్, కామెడీ, క్లాసికల్ ఇలా అన్ని జానర్స్ కి సంబంధించిన సినిమాలు ఉండటం విశేషం. ముఖ్యంగా స్టార్ హీరోల బ్లాక్బస్టర్లు, కల్ట్ క్లాసిక్స్‌పై ఫోకస్ పెడుతున్నారు. గతంలో బాహుబలి, పోకిరి, ఖుషి వంటి సినిమాలు రీ-రిలీజ్లో మంచి కలెక్షన్లు రాబట్టిన నేపథ్యంలో… ఇప్పుడు జూలై మాసం మరింత హైప్ క్రియేట్ చేస్తోంది.
ఈ సినిమాలు రీ-రిలీజ్ కావడం వెనుక ఫ్యాన్ బేస్ ప్రమోషన్, స్పెషల్ డేస్ (హీరో బర్త్‌డేలు/సినిమా యానివర్సరీస్) కూడా ఒక కారణం. ఇప్పటికే టికెట్ బుకింగ్స్ మొదలైపోయాయి. కొన్ని సినిమాలకు స్పెషల్ 4K వెర్షన్ లో సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి. అభిమానులు మళ్లీ తమ ఫేవరెట్ హీరోలని భారీ స్క్రీన్‌పై చూడాలనుకుంటున్న నేపథ్యంలో, జూలై నెలలో టికెట్ కౌంటర్ల దగ్గర సందడి తప్పదు. మరి ఈ నెలలో ముందుగా రానున్న చిత్రం ఎంఎస్ ధోని. ఈ మూవీ జూలై 7న ప్రేక్షకుల ముందుకు వచ్చి సందడి చేయనుంది. ఇక జూలై 10న కుమారి 21ఎఫ్ చిత్రం విడుదల కానుంది.
మరోవైపు జూలై 11న రవితేజ నటించిన మిరపకాయ్ చిత్ర థియేటర్స్‌లోకి రానుంది. జూలై 18న సూర్య నటించిన గజినీ, ఏ మాయ చేశావే చిత్రాలు విడుదల కానున్నాయి. ఈ రెండు చిత్రాలు సూపర్ హిట్ కాగా, వాటికి సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అభిమానులు కూడా ఈ చిత్రాలని తిరిగి పెద్ద తెరపై చూసేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. మరోవైపు జూలై 19న వీడొక్కడే సినిమా రీ రిలీజ్ కానుంది. మొత్తానికి జూలై నెలలో ఆరు సినిమాలు రీరిలీజ్‌కి రెడీగా ఉండగా, రానున్న రోజులలో మరి కొన్ని సినిమాలు యాడ్ అయిన ఆశ్చర్యపోనక్కర్లేదు.