లాస్ ఏంజిల్స్ : భారతీయ సంతతికి చెందిన బ్రిటీష్-అమెరికన్ డ్రగ్ డీలర్ జస్వీన్ సంఘాకు 15 ఏళ్ల జైలుశిక్ష పడింది. హాలీవుడ్ ప్రముఖలకు డ్రగ్స్ సరఫరా చేసినట్లు ఆమెపై ఆరోపణలు ఉన్నాయి. జస్వీన్ సంఘా వయసు 42 ఏళ్లు, ఆమెను కీటమైన్ క్వీన్(Ketamine Queen)గా పిలుస్తారు. ఫ్రెండ్స్ నటుడు మాథ్యూ పెర్రీ మృతి కేసులో ఆమెకు ఆ శిక్ష పడింది. భారతీయ సంతతికి చెందిన జస్వీన్‌కు ద్వంద్వ పౌరసత్వం ఉన్నది. అమెరికా, బ్రిటీన్లో ఆమెకు పౌరసత్వం ఉంది.
పంజాబీ మూలాలు ఉన్న కీటమైన్ క్వీన్.. లండన్‌లో పుట్టింది. కెనడా-అమెరికన్ నటుడు మాథ్యూ పెర్రీ కేసులో ఆమె ఓ నిందితురాలు. ఈ కేసులో అయిదుగురిపై అభియోగాలు ఉన్నాయి. 2023లో ఓవర్‌డోస్ వల్ల నటుడు పెర్రీ మృతిచెందాడు. లాస్ ఏంజిల్స్‌లోని ఇంట్లో అతను హాట్‌టబ్‌లో పడి ప్రాణాలు కోల్పోయాడు. లాస్ ఏంజిల్స్‌లో ఉన్న తన అపార్ట్మెంట్ నుంచి భారీ ఎత్తున డ్రగ్ ఆపరేషన్ నిర్వహించినట్లు సంఘాపై ఆరోపణలు ఉన్నాయి.
కీటమైన్, మీథాంపిటమైన్తో పాటు ఇతర మత్తు పదార్ధాలను ఆమె సరఫరా చేసినట్లు తెలుస్తోంది. తన వ్యాపారాన్ని వృద్ధి చేసుకునేందుకు తానే డీలర్‌ని అని చెప్పుకుని హాలీవుడ్లో డ్రగ్స్ దందా నిర్వహించినట్లు తెలుస్తోంది. ఎరిక్ ఫ్లెమింగ్ అనే వ్యక్తి ద్వార కీటమైన్ డ్రగ్‌ను మాథ్యూ పెర్రీకి సరఫరా చేసినట్లు అటార్నీ చెప్పారు. పెర్రీ చనిపోయిన నెలలో అతనికి సుమారు 51 వయల్స్ కీటమైన్‌ను ఆమె అమ్మినట్లు ప్రాసిక్యూటర్లు తెలిపారు.