నివేద థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్ ప్రధాన పాత్రధారులుగా రూపొందిన చిత్రం ‘35-చిన్న కథ కాదు’. నందకిశోర్ ఈమని రచన, దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి నటుడు రానా దగ్గుబాటి, సృజన్ యరబోలు, సిద్దార్థ్ రాళ్లపల్లి నిర్మాతలు. ఈ నెల 6న తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా ట్రైలర్‌ని విడుదల చేశారు.
అగ్ర హీరో అక్కినేని నాగార్జున ట్రైలర్‌ని ఆవిష్కరించి చిత్ర యూనిట్‌కి శుభాకాంక్షలు అందించారు. ఇక ట్రైలర్ విషయానికొస్తే.. ‘మ్యాథ్స్ సబ్జెక్ట్‌తో ఇబ్బంది పడుతున్న ఓ పిల్లాడ్ని పరిచయం చేస్తూ ట్రైలర్ మొదలైంది. తల్లిదండ్రులుగా కనిపిస్తున్న నివేద థామస్, విశ్వదేవ్ ఆ పిల్లాడి భవిష్యత్ విషయం ఆందోళన చెందుతున్నారు.
ఆ పిల్లాడ్ని తోటి స్టూడెంట్స్‌తోపాటు టీచర్లు కూడా ‘సున్నా’ అని పిలుస్తుంటారు. మరి ఆ పిల్లాడు సవాళ్లను అధిగమించి 35 మార్కులతో ఎలా ఉత్తీర్ణుడయ్యాడు? అనేది ఈ కథలో ప్రధానాంశం అని ట్రైలర్ చూస్తే అర్థమవుతున్నది. అందరికీ కనెక్టయ్యే మంచి కథాంశంతో రూపొందిన ఈ చిత్రానికి కెమెరా: నికేత్ బొమ్మి, సంగీతం: వివేక్ సాగర్.